కొలంబో వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక జట్టు అద్భుతం చేసింది. ఓటమి ఖాయమనుకున్న వేళ లంక బ్యాటర్లు విరోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా ముగించారు. ముఖ్యంగా శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన దినుష.. దాదాపు 100 ఓవర్ల పాటు క్రీజులో ఉండి తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతడు సెంచరీలతో సత్తాచాటాడు. ఇక ఈ కీలక మ్యాచ్ డ్రా కావడంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.
"ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మేము మా శాయశక్తులా ప్రయత్నించాము. వరుసగా మూడు రోజుల పాటు దాదాపు 250 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాము. అయినప్పటికి వారు అద్భుతంగా ఆడారు. కచ్చితంగా శ్రీలంక బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా వారికి కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది.
మేము అక్కడ ఇంకా కొత్త ప్రయోగించాల్సింది ఏమి లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఈ సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒత్తిడిలో శ్రీలంక పుంజుకున్న తీరు నిజంగా ఒక అద్భుతం.
లంచ్, టీ విరామ సమయంలో కూడా మేము దీని గురించే చర్చించాం. ఇక దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు.కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్ చూపించాడు. మరోవైపు మానవ్ సుతార్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటర్ల మైండ్‌సెట్‌ను ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నాడు. అతడు కచ్చితంగా సుదీర్ఘ కాలం పాటు భారత జట్టులో కొనసాగుతాడు. ఈ మ్యాచ్‌లో మా పేస్ బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారు" అని గిల్ పేర్కొన్నాడు.
అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు గురుంచి గిల్ మాట్లడుతూ.. "మేము నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తున్నాం. అక్కడ మ్యాచ్‌లను గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్నాం. ఈ రెండు సిరీస్‌లలోనూ గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంటామన్న నమ్మకం ఉందని" చెప్పుకొచ్చాడు.
చదవండి: WTC 2025-27: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు బిగ్ షాక్


