PC: X
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతం చేశారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు. నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన మన బౌలర్లు.. చివరి రోజున మిగిలిన 4 వికెట్లు తీయలేకపోయారు.
లంక బ్యాటర్ సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. అసాధారణ బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయిన అతడి వికెట్ కోసం భారత్ చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. అతడితో పాటు టెయిలాండర్లు లహిరు కుమార (90 బంతుల్లో 12), కేశర నువాంత (150 బంతుల్లో 46), అషిథా ఫెర్నాండో (24 బంతుల్లో 0 నాటౌట్) వీరోచిత పోరాటం కనబరిచారు.
తొమ్మిదో వికెట్‌గా కుమార అవుట్ కావడంతో శ్రీలంకను భారత్ త్వరగా ఆలౌట్ చేసి బ్యాటింగ్‌కు వస్తుందని అంతా భావించారు. కానీ పదకొండో నంబర్ బ్యాటర్ ఫెర్నాండో కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో విసుగు తెప్పించాడు. అతడి వికెట్ కోసం ఆఖరికి కెప్టెన్ శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్ కూడా బౌలింగ్ చేశారు.
అయినా చివరి వికెట్‌ను పడగొట్టలేకపోయారు. దీంతో మరో 18 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్లూ డ్రాకు అంగీకరించాయి. అప్పటికే శ్రీలంక 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకవేళ భారత్ బ్యాటింగ్‌కు దిగినా ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
బెడిసి కొట్టిన టీమిండియా ప్లాన్
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115) సెంచరీలతో సత్తాచాటగా.. గిల్(50), పంత్(63) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో కూడా సోనల్ దినుష(103) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు పసిందు సూరియబండార(80) కూడా రాణించాడు.
మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో సునాయస విజయం సాధించవచ్చనే నమ్మకంతో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లంక జట్టుకు ఫాలో-ఆన్‌కు ఆహ్వానించాడు. గిల్ తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టిందనే చెప్పాలి. ఫాలో ఆన్‌లో శ్రీలంక అద్భుతమైన పోరాటం కనబరిచి మ్యాచ్‌ను డ్రా ముగించింది.
సంక్షిప్త స్కోర్లు..
భారత తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్
చదవండి: చరిత్ర సృష్టించిన వరుస సెంచరీల వీరుడు సొనాల్ దినుష


