లంక కెప్టెన్ ధనంజయ- భారత కెప్టెన్ గిల్ (PC: SLC X)
టీమిండియాతో రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఎట్టకేలకు ఆధిక్యంలోకి వచ్చింది. పసిందు సూరియబండారా అద్భుత ఆట తీరుతో లంక పరువును కాపాడాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే.
సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాల వల్ల భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.
290 రుగులకే ఆలౌట్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 290 రుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. దీంతో లంక దాదాపు మూడు వందల పరుగులకు చేరువకాగలిగింది.
ఫాలో ఆన్
భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. అరంగేట్ర ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలో ఆన్‌లో భాగంగా వెంటనే శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
రాణించిన పసిందు, కమిందు
ఈ క్రమంలో బుధవారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే శ్రీలంక తమ ఓపెనర్ లాహిరు ఉదార (3) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ కమిల్ మిశార (32)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ పసిందు రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆ తర్వాత కమిందు మెండిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించాడు.
ఈ క్రమంలో కమిందు అర్ధ శతకం (55) పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కాగా.. పసిందు సెంచరీ దిశగా పయనించాడు. అయితే, మానవ్ సుతార్ స్పిన్ మాయలో చిక్కుకుని.. 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్‌వెల్లా (6) విఫలమయ్యాడు.
ఎట్టకేలకు ఆధిక్యంలోకి లంక
అయితే, వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేశారు. మొత్తానికి నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. సెంచరీ వీరుడు సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.
భారత బౌలర్లలో మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, సారాంశ్ జైన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆటకు గురువారమే చివరి రోజు. అయితే, బుధవారం వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేసిన క్రమంలో గురువారం ఉదయం 9.45 నిమిషాలకే మ్యాచ్ ఆరంభమవుతుంది.
ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే గాలెలో టీమిండియా గెలుపొందింది. కొలంబోలోనూ భారత్ గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే, వర్షం ముప్పు కారణంగా గురువారం వీలైనంత త్వరగా లంకను ఆలౌట్ చేసి.. విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.


