PC: BCCI/sonysports X
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. శ్రీలంకతో రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా క్యాచ్ అందుకునే క్రమంలో ఈ హైదరాబాదీ అదుపుతప్పి కిందపడ్డాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 503-9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా శ్రీలంకను 290 పరుగులకు ఆలౌట్ చేసిన.. టీమిండియా ఫాలో ఆన్ ఆడిస్తోంది.
పసిందు క్యాచ్ అందుకునేందుకు..
ఈ క్రమంలో లంక రెండో ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్‌లో శ్రీలంక వన్‌డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా షాట్ ఆడగా.. క్యాచ్ పట్టేందుకు సిరాజ్ డీప్ మిడ్ వికెట్ పొజిషన్ నుంచి పరిగెత్తుకు వచ్చి డైవ్ కొట్టాడు.
మైదానం వీడి..
ఈ క్రమంలో బంతిని అందుకున్నప్పటికీ.. అది సిరాజ్ చేజారింది. అదుపు తప్పి కిందపడ్డ సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కటెముకల వద్ద చేయి పెట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. హుటాహుటిన ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, నొప్పి తగ్గకపోవడంతో సిరాజ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు.
తిరిగి వచ్చిన సిరాజ్
భోజన విరామం తర్వాత కూడా సిరాజ్ ఫీల్డ్‌కు రాలేదు. దీంతో సిరాజ్ గాయంపై అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. అయితే, కాసేపటి తర్వాత అతడు మైదానానికి వచ్చి చురుకుగా ఫీల్డింగ్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.


