IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్‌ | Sonal Dinusha Scripts history despite SL pushed to follow on vs India | Sakshi
Sakshi News home page

IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్‌

Aug 26 2026 12:17 PM | Updated on Aug 26 2026 12:37 PM

Sonal Dinusha Scripts history despite SL pushed to follow on vs India

సొనాల్‌ దినుష (PC: SLC X)

టీమిండియాతో టెస్టుల్లో శ్రీలంక ప్రదర్శన ఎలా ఉన్నా.. ఆ జట్టు ఆల్‌రౌండర్‌ సొనాల్‌ దినుష మాత్రం అదరగొడుతున్నాడు. గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట సొనాల్‌ దినుష సెంచరీ (100)తో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.

భారత్‌ భారీ స్కోరు
అదే విధంగా.. భారత్‌తో రెండో టెస్టులోనూ సొనాల్‌ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కొలంబో వేదికగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి... 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక టాపార్డర్‌ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓపెనర్లు లాహిరు ఉదార (1), కమిల్‌ మిశారా (19)లను ప్రసిద్‌ కృష్ణ పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రభాత్‌ జయసూరియ (2)ను మానవ్‌ సుతార్‌ అవుట్‌ చేశాడు.

పసిందు పోరాటం
ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోగా పసిందు సూరియబండారా (80), కమిందు మెండిస్‌ (32) కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. వీళ్లిద్దరు అవుటైన తర్వాత శ్రీలంక నామమాత్రపు స్కోరుకే ఆలౌట్‌ అవుతుందని భావించగా.. సొనాల్‌ దినుష నేనున్నానంటూ మరోసారి ఆపన్నహస్తం అందించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ ఆల్‌రౌండర్‌ శతక్కొట్టాడు.

సెంచరీ చేశాడు.. కానీ
మొత్తంగా 162 బంతులు ఎదుర్కొన్న సొనాల్‌ దినుష.. 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. పసిందుతో కలిసి 34, కేశారా నువాంతతో కలిసి 57, లాహిరు కుమారతో కలిసి 58 పరుగులు జోడించి.. జట్టు పరువును కాపాడగలిగాడు. 

అయితే, ఫాలో ఆన్‌ గండం నుంచి మాత్రం తప్పించలేకపోయాడు. కొలంబోలో నాలుగో రోజు ఆటలో భాగంగా భారత స్పిన్నర్‌ సారాంశ్‌ జైన్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి సొనాల్‌ దినుష పదో వికెట్‌గా వెనుదిరిగాడు.

సరికొత్త చరిత్ర 
అయితే, తన అద్భుతమైన ఆట తీరుతో 25 ఏళ్ల సొనాల్‌ దినుష శ్రీలంక తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టుల్లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన తొలి లంక ఆటగాడిగా రికార్డు సాధించాడు. గాలె, కొలంబో టెస్టుల్లో శతకాలు బాది ఈ ఘనత సాధించాడు. కాగా దినుష గతేడాది జూన్‌లో అరంగేట్రం చేశాడు. 

ఇదిలా ఉంటే.. లంకను 290 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో లంకను ఫాలో ఆన్‌ ఆడిస్తోంది. కాగా గాలె టెస్టులో శ్రీలంక టీమిండియా చేతిలో 165 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.

టీమిండియాతో టెస్టుల్లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన శ్రీలంక క్రికెటర్లు
సొనాల్‌ దినుష- 2 శతకాలు
దినేశ్‌ చండిమాల్‌-1 శతకం
తిలక్‌రత్నె దిల్షాన్‌-1 శతకం
ప్రసన్న జయవర్దనె-1 శతకం
అర్జున రణతుంగ-1 శతకం
తిలాన్‌ సమరవీర-1 శతకం
హషాన్‌ తిలకరత్నె-1 శతకం.

చదవండి: టెస్టు క్రికెట్‌లో ఫాలో ఆన్‌ అంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement