‘జైస్వాల్‌ మావాడు.. అతడి నిర్ణయం ఏమిటో తెలియదు’ | Rajasthan Royals Break Silence On Jaiswal Mumbai Indians Trade | Sakshi
Sakshi News home page

‘జైస్వాల్‌ మావాడు.. అతడి నిర్ణయం ఏమిటో తెలియదు’

Aug 26 2026 11:33 AM | Updated on Aug 26 2026 12:04 PM

Rajasthan Royals Break Silence On Jaiswal Mumbai Indians Trade

PC: RR Instagram

ఐపీఎల్‌-2027 వేలానికి ముందే పలువురు స్టార్ క్రికెటర్ల ట్రేడింగ్‌ జరుగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఈసారి జట్టు మారడం ఖాయమనే ఊహాగానాలు వస్తుండగా.. అలాంటిదేమీ లేదని యాజమాన్యం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.

అయినప్పటికీ వదంతులు మాత్రం ఆగటం లేదు. హార్దిక్‌ పాండ్యా చెన్నై సూపర్‌ కింగ్స్‌ లేదంటే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుతో చేరతాడనే ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు రాజస్తాన్‌ రాయల్స్‌తో ముంబై చర్చలు జరుపుతోందని.. హార్దిక్‌ను ఇచ్చి అతడికి బదులు యశస్వి జైస్వాల్‌ను తీసుకోనుందనే రూమర్లు వినిపిస్తున్నాయి.

రాయల్స్‌ తరఫున అరంగేట్రం
కాగా 2020లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్‌.. తన అద్భుతమైన ఆట తీరుతో పోస్టర్‌ బాయ్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసి టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయాడు. అయితే, వైభవ్‌ సూర్యవంశీ వచ్చిన తర్వాత జైస్వాల్‌ ఒత్తిడికి లోనవుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జైసూ ‘స్థానాన్ని’ ఆక్రమించేసిన వైభవ్‌?
ముఖ్యంగా ఐపీఎల్‌-2026లో పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ గెలవడం జైసూను ఒత్తిడిలోకి నెట్టేసిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. ఓపెనర్లుగా జైస్వాల్‌ కాస్త ఆచితూచి ఆడగా.. వైభవ్‌ మాత్రం దూకుడుగా ఆడుతూ రోజురోజుకీ తన గ్రాఫ్‌ పెంచుకుంటూ పోతున్నాడు. రాయల్స్‌ జట్టుకు ప్రధాన గుర్తింపుగా పేరు తెచ్చుకుంటున్నాడు.

అసంతృప్తి.. ఒత్తిడి?
మరోవైపు.. 2026కు ముందు రాజస్తాన్‌ తమ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్‌ చేసింది. అతడి స్థానంలో జైస్వాల్‌కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ రియాన్‌ పరాగ్‌ వైపే మొగ్గుచూపిన యాజమాన్యం జైస్వాల్‌ను కెప్టెన్సీ రేసు నుంచి పక్కనపెట్టింది. 

ఓవైపు కెప్టెన్సీ విషయంలో అసంతృప్తిగా ఉన్న జైసూ.. మరోవైపు వైభవ్‌ విషయంలో ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో జట్టును వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

జైస్వాల్‌ మావాడు
ఈ విషయంపై రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. తమకైతే జైస్వాల్‌ను వదులుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకైతే జట్టు మార్పు గురించి జైస్వాల్‌ మాతో ఏమీ చర్చించలేదు.

వచ్చే సీజన్‌లో అతడిని దృష్టిలో పెట్టుకునే మేము ప్రణాళికలు రచించుకుంటున్నాము. అయితే, కొన్ని వదంతులు మా దాకా వచ్చాయి. మేము మాత్రం జైస్వాల్‌ను మా ప్లేయర్‌గానే భావిస్తున్నాము. అతడు మా ఆటగాడు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. మరి ఇంతకు జైస్వాల్‌ తనకు తొలి అవకాశం ఇచ్చిన రాయల్స్‌తో కొనసాగుతాడా?.. మీకో దండం అంటూ కొత్త దారి వెతుక్కుంటూ ఫ్రాంఛైజీ మారతాడా? అనేది త్వరలోనే తేలనుంది.

చదవండి: శ్రీలంక ఆలౌట్‌.. ఫాలో ఆన్‌ ఆడిస్తున్న టీమిండియా!.. ఫాలో ఆన్‌ అంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement