PC: BCCI X
టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీళ్లిద్దరు హద్దు మీరుతున్నారన్నాడు. కాబట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.
కాగా ఇటీవల భారత్-‘ఎ’ జట్టు శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-‘ఎ’తో కీలక మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ క్రీజును వీడుతుండగా.. లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. ‘మ్యాచ్ అయిపోయింది. ఇంటికి వెళ్లు’ అని కవ్వించినట్లు తెలిసింది.
ఇందుకు వైభవ్ ధీటుగా బదులిచ్చాడు. సహనం కోల్పోయిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు లంక ప్లేయర్‌పైకి దూసుకువెళ్లి విశేన్‌ను వెనక్కి నెట్టాడు. అతడూ వైభవ్‌నూ తోసేయగా.. మిగతా లంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకోలేదని సమాచారం.
ఇక తాజాగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా అసితా ఫెర్నాండోతో గొడవపడ్డాడు. జైసూను అవుట్ చేసిన తర్వాత అసితా ఏదో అనడంతో.. అతడిపైకి దూసుకెళ్లి హెల్మెట్‌తో డ్యాష్ ఇచ్చాడు. అతడూ జైసూ పైపైకి వెళ్లాడు. దీంతో ఐసీసీ జైస్వాల్, అసితాలకు జరిమానా వేయడంతో పాటు వారి ఖాతాలో డీమెరిట్ పాయింట్ జత చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘ప్రియమైన ఐసీసీ, బీసీసీఐ.. ఇటీవల ఇండియా-ఎ టూర్ సందర్భంగా వైభవ్.. ఇప్పుడు జైస్వాల్.. వీళ్లిద్దరు హద్దు మీరి ప్రవర్తించారు. వీరిని ఇలాగే కొనసాగిస్తే కష్టం. మళ్లీ అవే తప్పులు పునరావృతం చేస్తారు.
క్రీడా స్ఫూర్తికి ముఖ్యంగా వాళ్లిద్దరి భవిష్యత్తుకు ఇది ఎంత మాత్రం మంచి కాదు’’ అని ఎక్స్ వేదికగా మంజ్రేకర్ ఐసీసీ, బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అయితే, నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది మంజ్రేకర్‌కు మద్దతు పలుకుతూ ఉంటే.. మరికొందరు మాత్రం ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లే రెచ్చగొట్టారని.. అందుకు వైభవ్, జైసూ కేవలం స్పందించారంటూ వారిని సమర్థిస్తున్నారు.


