27 ఏళ్లకే కెరీర్‌ క్లోజ్‌; ప్రతీకార చర్యకు మాజీ క్రికెటర్‌ సిద్ధం! | Will-Pucovski-Forced-Retire-At-27-Sues-Over-School-Concussion-Protocol-Failures | Sakshi
Sakshi News home page

Will Pucovski: 27 ఏళ్లకే కెరీర్‌ క్లోజ్‌; ప్రతీకార చర్యకు మాజీ క్రికెటర్‌ సిద్ధం!

Aug 26 2026 4:47 PM | Updated on Aug 26 2026 5:34 PM

Will-Pucovski-Forced-Retire-At-27-Sues-Over-School-Concussion-Protocol-Failures

Photo Credit: Twitter

ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ విల్‌ పకోవ్‌స్కీ గుర్తున్నాడా? దాదాపు 13 సార్లు కంకషన్‌ (తలకు తీవ్ర గాయం)కు గురై వైద్యుల సలహాతో 27 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. అయితే తాజాగా 14 ఏళ్ల క్రితం జరిగిన తొలి కంకషన్‌ కారణంగా తన కెరీర్‌ నాశనమైందని, అప్పుడే తాను శిక్షణ తీసుకుంటున్న స్కూల్‌ కంకషన్‌ ప్రమాణాలు పాటించి ఉంటే ఇవాళ తన క్రికెట్‌ కెరీర్‌ ఎంతో సాఫీగా సాగేదని పేర్కొన్న పకోవ్‌స్కీ ప్రతీకార చర్యలకు సిద్ధమయ్యాడు.

ఈ నేపథ్యంలోనే విల్ పకోవ్‌స్కీ 2014లో తాను కోచింగ్ తీసుకున్న బ్రైటన్‌ గ్రామర్ స్కూల్‌పై తాజాగా కంకషన్‌లో ప్రమాణాలు పాటించనందుకు తన కెరీర్‌ నాశనమైందంటూ సదరు సంస్థపై చట్టపరమైన చర్యలకు దిగడం సంచలనం కలిగించింది.  కంకషన్‌కు సంబంధించి ప్రామాణిక ప్రొటోకాల్స్ పాటించడంలో బ్రైటన్ గ్రామర్ స్కూల్ విఫలమైందని ఆరోపించిన పకోవ్‌స్కీ న్యాయ బృందం విక్టోరియా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. 


Photo Credit: Twitter

పకోవ్‌స్కీ న్యాయవాదుల వివరాల ప్రకారం.. పకోవ్‌స్కీ తన 16 ఏళ్ల వయసులో బ్రైటన్ గ్రామర్ ట్రైనింగ్ స్కూల్‌లో ఫుట్‌బాల్ శిక్షణ తీసుకున్నాడు. ట్రైనింగ్ సమయంలో పుకోవ్‌స్కీ తల సహచర ఆటగాడి మోకాలికి గట్టిగా తగలడంతో స్పృహ కోల్పోయాడని పిటిషన్‌లో ఆరోపించారు. కంకషన్‌కు గురైన పకోవ్‌స్కీకి ఆ సమయంలో సరైన వైద్య పరీక్షలు చేయకుండానే, శిక్షణ తిరిగి తీసుకోవడానికి అనుమతించారని పేర్కొన్నారు. 

పకోవ్‌స్కీకి గాయమైన విషయాన్ని అతడి తల్లిదండ్రులకు కూడా ఆలస్యంగా సమాచారం అందించినట్లు తెలిపారు.  ఆ తర్వాత కొన్ని రోజులకు పకోవ్‌స్కీ తీవ్రమైన తలనొప్పితో బాధపడడంతో పాటు అతడి దృష్టి మసకబారడం, వికారం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బంది పడినట్లు న్యాయవాదులు ఆరోపించారు. 

దీంతో పకోవ్‌స్కీని ఆసుపత్రికి తరలించగా, అతడి మెదడులో తీవ్ర గాయం అయిందని స్కానింగ్‌లో తేలినట్లు పేర్కొన్నారు. ఒకవేళ 2014లోనే విల్ పకోవ్‌స్కీ కంకషన్‌కు సంబంధించి స్కూల్ యాజమాన్యం కనీస ప్రమాణాలు పాటించి ఉంటే.. అతడు 27 ఏళ్లకే ఉజ్వల క్రికెట్ భవిష్యత్తును వదులుకోవాల్సిన అవసరం వచ్చేది కాదేమోనని అతడి తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో వాపోయారు.


Photo Credit: Twitter

ఇక విల్ పకోవ్‌స్కీ మార్చి 2024లో టస్మానియా ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ బౌలింగ్‌లో పుకోవ్‌స్కీ గాయపడ్డాడు. కంకషన్‌కు గురైన పకోవ్‌స్కీని క్రికెట్ ఆడడం ఆపేయాలని వైద్యులు సూచించారు. ఎందుకంటే పదేపదే అతడి తలకు గాయాలవడంతో దాదాపు 13 సార్లు కంకషన్‌కు గురయ్యాడు. మరోసారి కంకషన్‌కు గురైతే పరిస్థితి తీవ్రమయ్యే అవకాశముందని డాక్టర్లు హెచ్చరించారు. 

దీంతో పకోవ్‌స్కీ 27 ఏళ్ల వయసులోనే క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కెరీర్‌లో ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విల్ పకోవ్‌స్కీ 2021లో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సందర్భంగా భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ (62 పరుగులు) సాధించిన పకోవ్‌స్కీ రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక 2017లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విల్ పుకోవ్‌స్కీ 36 మ్యాచ్‌లాడి 2,350 పరుగులు సాధించాడు, ఇందులో ఏడు సెంచరీలు, 9 అర్ధసెంచరీలున్నాయి.

చదవండి: టీమిండియా కొంపముంచిన ప్రసిధ్‌.. గంభీర్‌, జడేజా ఆగ్రహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement