Photo Credit: BCCI Twitter
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆటకు మరో రోజు మిగిలి ఉన్న సమయంలో టీమిండియా మరో విజయం దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత రెండో సెషన్‌లో జడేజా, సిరాజ్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది.
లంక రెండో ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జడేజా బౌలింగ్‌లో పసిందు సూరియబండార డీప్ ఫార్వర్డ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి బౌండరీకి వెళ్లనప్పటికీ, అక్కడే ఉన్న సిరాజ్ వెనక్కి పరిగెత్తి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడికి చాలా దూరంలో పడింది.
క్యాచ్ పట్టడం కష్టమని తెలిసినా కూడా జడేజా మాత్రం సిరాజ్ చర్యపట్ల అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా అరిచాడు. దీంతో సిరాజ్‌కు చిర్రెత్తుకొచ్చి.. ‘అరె జడ్డూ బాయ్.. నువ్వు నా ఏరియాలో నిలబడి ఫీల్డింగ్ చెయ్యు.. అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది’ అని నవ్వుతూనే కౌంటర్ ఇచ్చాడు. దీనికి ప్రతిచర్యగా జడేజా మాత్రం ‘సరే వదిలెయ్’ అన్నట్లుగా తలూపాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాటలు అరుచుకున్నప్పటికీ కాసేపటికే ఇద్దరూ కూల్ అయ్యారు.
మ్యాచ్ విషయానికొస్తే.. బుధవారం నాలుగో రోజు ఆటలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు.
భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. డెబ్యూ ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే లంకను ఫాలో ఆన్ ఆడించేందుకు టీమిండియా మొగ్గు చూపింది.
లంక తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రోజు ముగిసేసరికి 5 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న లంక 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
— crictalk (@crictalk7) August 26, 2026
Read: 27 ఏళ్లకే కెరీర్ క్లోజ్; ప్రతీకార చర్యకు మాజీ క్రికెటర్ సిద్ధం!


