న్యూఢిల్లీ: భారత యువ రేసర్ అతీఖా మీర్‌తో జేకే టైర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ... పిన్న వయసులోనే లెక్కకు మిక్కిలి రికార్డులు నెలకొల్పిన అతీఖాకు ఇకపై జేకే టైర్స్ అండగా నిలవనుంది. కార్టింగ్ సర్క్యూట్‌లో తనదైన ముద్ర వేసిన 11 ఏళ్ల అతీఖా... యూరప్ రేసులను గెలిచి ఔరా అనిపించుకుంది. ఈ క్రమంలో వయసులో తనకంటే పెద్దవాళ్లతో పోటీపడి చక్కటి ఫలితాలు సాధించింది. ఫార్ములావన్ అకాడమీ మద్దతు పొందిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం యూరప్‌లోని వివిధ సిరీస్‌లలో పోటీ పడుతోంది.
ఫార్ములావన్ స్థాయికి చేరిన భారత రేసర్‌లు నారాయణ్ కార్తికేయన్, కరుణ్ చందోక్‌లను కూడా జేకే టైర్స్ గతంలో మద్దతు తెలిపింది. ఇప్పుడు వారిద్దరి సరసన అతీఖా చేరింది. ఈ ఏడాది ఆరంభంలో ‘చాంపియన్స్ ఆఫ్ ఫ్యూచర్ అకాడమీ యూరోపియన్ లెగ్’ పోటీల్లో పోడియంపై నిలిచిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. ఆ తర్వాత గ్రీస్‌లో జరిగిన టోర్నమెంట్‌లో తిరుగులేని వేగంతో విజేతగా నిలిచింది.
ఈ క్రమంలో హీట్స్, క్వాలిఫయింగ్, ఫైనల్‌లో నెగ్గిన మూడో డ్రైవర్‌గా గుర్తింపు సాధించింది. యూరోపియన్ కార్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు టాప్–10లో చోటు దక్కించుకున్న అతిపిన్న వయసు్కరాలిగా నిలిచిన ఆమె... ఎఫ్1 అకాడమీ ‘డిస్కవర్ యువర్ డ్రైవ్’కు ఎంపికైన తొలి భారతీయ, ఆసియా మహిళా రేసర్‌గా రికార్డు నెలకొల్పింది.


