ఎదురులేని అతీఖా మీర్‌ | Atiqa Mir wins Champions of the Future Race | Sakshi
Sakshi News home page

ఎదురులేని అతీఖా మీర్‌

Jun 3 2026 3:37 AM | Updated on Jun 3 2026 3:37 AM

Atiqa Mir wins Champions of the Future Race

‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌’ రేస్‌లో విజయం

థెసలొనికి (గ్రీస్‌): కార్‌ రేసింగ్‌లో సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్న 11 ఏళ్ల భారత రేసర్‌ అతీఖా మీర్‌ మరోసారి సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ద ఫ్యూచర్‌’ అకాడమీ ప్రోగ్రామ్‌ రేసింగ్‌ రౌండ్‌ 2లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 12–14 మధ్య వయో విభాగం ఉండే (ఓకే–ఎన్‌జే) కేటగిరీలో ఆమె అనుభవజ్ఞులైన డ్రైవర్లను దాటి విజేతగా నిలిచింది. ఈ రేసు క్వాలిఫయింగ్, హీట్స్, ఫైనల్స్‌లో కూడా అతీఖా అగ్రస్థానంలో నిలవడం విశేషం. 

ఈ సిరీస్‌లో మూడు ఈవెంట్లలోనూ గతంలో ఇద్దరు మాత్రమే విజేతలుగా నిలిచారు. ఇప్పుడు అతీఖా అరుదైన జాబితాలో చోటు దక్కించుకుంది. తాజా విజయానంతరం పోడియంపై భారత జాతీయ గీతం వినిపించినప్పుడు ఈ ముంబై అమ్మాయి భావోద్వాగానికి గురైంది. 56.77 సెకన్ల రికార్డు టైమింగ్‌తో పోల్‌ పొజిషన్‌ సాధించిన మీర్‌...హీట్‌ 1, 2లలో మొదటినుంచి చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించింది. 

15 ల్యాప్‌లో ఫైనల్‌లో ఎనిమిది ల్యాప్‌ల తర్వాత 3.9 సెకన్ల తేడాతో ముందంజలో నిలిచిన ఆమె చివరకు 2.6 సెకన్ల తేడాతో నెగ్గింది. 25 మంది డ్రైవర్లు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో ఇది 2.6 సెకన్లను చాలా పెద్ద విజయంగా గుర్తించవచ్చు. ఫార్ములా 1 అకాడమీ నుంచి సహకారం పొందుతున్న తొలి భారత రేసర్‌ అయిన అతీఖా మీర్‌... మాజీ రేసర్‌ అయిన ఆసిఫ్‌ మీర్‌ వద్దే శిక్షణ పొందుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement