రేసింగ్‌లో విషాదం.. ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ! | Racer Juha Miettinen Killed in Crash That Involved Max Verstappen | Sakshi
Sakshi News home page

రేసింగ్‌లో విషాదం.. తృటిలో తప్పించుకున్న వెర్‌స్టాపెన్‌!

Apr 19 2026 6:41 PM | Updated on Apr 19 2026 8:06 PM

Racer Juha Miettinen Killed in Crash That Involved Max Verstappen

బీఎండబ్ల్యూ రేసర్‌ జుహా మియెట్టినెన్ (ఎడమ) , మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (కుడి)

ఫార్ములావన్ రేసింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం జర్మనీలోని నుర్బుర్గ్ రింగ్‌లో జరిగిన నుర్బుర్గ్ రింగ్ లాంగ్‌స్రెకెన్ సిరీస్ (ఎన్‌ఎస్‌ఎల్) క్వాలిఫయింగ్ రేసు విషాదాంతమైంది. ఏడు రేసింగ్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో వెట‌ర‌న్‌ రేసింగ్‌ డ్రైవర్ 66 ఏళ్ల జుహా మియెట్టినెన్ ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం జుహా మియెట్టియెన్ బీఎండ‌బ్ల్యూ 325ఐ రేసింగ్ కారుకు డ్రైవ‌ర్‌గా ఉన్నాడు. 

ఇక ఇదే రేసులో పాల్గొన్న నాలుగుసార్లు ఫార్ములా వన్ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ సహా మిగతా డ్రైవర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నాలుగు గంట‌ల‌పాటు జ‌ర‌గాల్సిన ఈవెంట్‌లో రేస్ ప్రారంభ‌మైన 25 నిమిషాల‌కే ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. ట్రాక్‌లోని క్లోస్ట‌ర్‌టాల్ వ‌ద్ద ఎత్తులో ఉన్న‌ప్పుడు సెక‌న్ల వ్య‌వ‌ధిలో ఏడు కార్లు ఒక‌దానితో ఒక‌టి ఢీకొట్టాయి. 

దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంట‌నే రేసును నిలిపేశారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పారా మెడిక‌ల్ సిబ్బంది  జుహా మియెట్టియెన్‌ను కారులో నుంచి బ‌య‌టికి తీసిన‌ప్ప‌టికీ అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. మిగ‌తా వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇందులో వెర్‌స్టాపెన్ కూడా ఉన్నాడు. 

కాగా మియెట్టియెన్ మ‌ర‌ణంపై ఎన్‌ఎస్‌ఎల్ నిర్వాహకులు విచారం వ్య‌క్తం చేశారు. ఇక మోటార్ స్పోర్ట్స్ నియంత్ర‌ణ సంస్థ (ఎఫ్ఐఏ) విచారం వ్య‌క్తం చేసింది. మియెట్టియెన్ మృతికి సంతాపం తెలిపిన ఎఫ్ఐఏ అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతిని తెలిపింది. ఇక షెడ్యూల్ ప్ర‌కారం ఆదివారం రేస్ జ‌రుగుతుంద‌ని ఎన్ఎస్ఎల్ తెలిపింది. 

అయితే రేస్ ప్రారంభానికి ముందు మియెట్టియెన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించ‌నున్నారు. ఈ రేసులో మాక్స్ వెర్‌స్టాపెన్‌తో పాటు మెర్సిడెస్ రేస‌ర్ లుకాస్ ఆర్ కూడా పాల్గొన‌నున్నాడు. కాగా జుహా మియెట్టియెన్‌ మరణంపై మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ స్పందించాడు. ‘మియెట్టియెన్‌ మరణం నన్ను తీవ్ర  దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని పోస్టు పెట్టాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement