Sakshi News home page

రయ్‌.. రయ్‌..

Published Mon, Feb 19 2024 5:03 AM

3079 crores ATC Tyres manufacturing unit at Achyutapuram: andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఎటువంటి ప్రచార ఆర్భాటం, ఒప్పందాలు, శంకుస్థాపనలు వంటి భారీ కార్యక్రమాలు లేకుండా కోవిడ్‌ సమయంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించిన జపాన్‌కు చెందిన ఒక భారీ మల్టీ నేషనల్‌ కంపెనీ విస్తరణ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపు.. అలయన్స్‌ టైర్స్‌ కంపెనీ (ఏటీసీ) పేరుతో రూ.3,079 కోట్ల భారీ పెట్టుబడితో టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో రూ.1,750 కోట్ల వ్యయంతో హాఫ్‌ హైవే టైర్లు (భారీ యంత్ర పరికరాలకు వినియోగించే టైర్లు) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది.

ఇందుకోసం 2019 నవంబర్‌లో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) 2020 నవంబర్‌లో ఆమోదం తెలిపారు. వెనువెంటనే అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ భూమి కేటాయించడంతో నిర్మాణ పనులు ప్రారంభించింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన వెంటనే కరోనా సంక్షోభం తలెత్తినా, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో తొలి దశ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది.

2022 జూలైలో తొలి టైరును ఉత్పత్తి చేసింది. ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 2022 ఆగస్టు 16న వాణిజ్యపరంగా ప్రారంభించారు. రోజుకు 132 టన్నుల రబ్బరును వినియోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన టైర్లను 120కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఫ్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్‌సీ సెగ్మెంట్‌), పెద్ద బయాస్‌ టైర్లు (అగ్రి మరియు కాన్స్‌), రేడియల్‌ టైర్లు (అగ్రి), రేడియల్‌ (ఓటీఆర్‌), బయాస్‌ టైర్, ఓటీఆర్‌ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్‌ టైర్లు వంటివి తయారవుతున్నాయి. 

ప్రభుత్వ ప్రోత్సాహంతో విస్తరణ 
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుండటంతో యకహోమా గ్రూపు ప్యాసింజర్‌ వాహనాల టైర్లను తయారు చేసే యూనిట్‌ నిర్మాణ పనులను ప్రారంభించింది.  సుమారు రూ.680 కోట్ల పెట్టుబడితో ప్యాసింజర్‌ కారు టైర్ల తయారీ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశీయ ప్యాసింజర్‌ కార్లకు డిమాండ్‌ భారీగా పెరగడంతో దానికి తగ్గట్టుగా ఏటా 17 లక్షల టైర్ల తయారీ సామర్థ్యంతో విస్తరణ పనులు మొదలు పెట్టింది. ఈ యూనిట్‌ను 2024 చివరి త్రైమాసికానికి అందుబాటులోకి తీసుకు రావాలని యకహోమా గ్రూపు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం 28 లక్షల టైర్లుగా ఉన్న ఏటీసీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఈ యూనిట్‌ ఏర్పాటు ద్వారా 45 లక్షల టైర్లకు చేరుకోనుంది.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న యూనిట్‌లో 22 అంగుళాల వరకు ఉండే  టైర్లను ఉత్పత్తి చేస్తారు. దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, 2022లో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా అవతరించిందని, ఇదే రకమైన వృద్ధి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని యకహోమా అంచనా వేస్తోంది. 2007లో 7 లక్షల టైర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇండియాలో అడుగుపెట్టిన ఈ గ్రూపు వేగంగా విస్తరిస్తోంది. ఇండియాలో ఇప్పటికే రెండు యూనిట్లు.. తిరువన్‌వేలి, దహేజ్‌ల్లో ఉండగా, మూడవ యూనిట్‌ను అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసింది.

ఈ యూనిట్‌ పూర్తి స్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే 2,300 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 75 శాతం మంది స్థానికులకే ఉపాధి కల్పించనున్నారు. ఇందుకోసం స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 1000 మందికిపైగా పని చేస్తుండగా, విస్తరణకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నారు.   

పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు  
ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు అందించింది. ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు పూర్తిగా సహకరించారు. నిర్దేశించుకున్న గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. – ప్రహ్లాదరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, ఏటీసీ టైర్స్‌ 

యకహోమా ఉద్యోగి కావడం ఆనందంగా ఉంది 
జపాన్‌కు చెందిన యకహోమా ఆఫ్‌ హైవే టైర్ల తయారీ యూనిట్‌లో ఉద్యోగిగా ఉండటం పట్ల చాలా ఆనందంగా ఉంది. క్యాంపస్‌ సెలక్షన్‌లో నేను ఏటీసీ టైర్స్‌లో ఉద్యోగం పొందాను. యకహోమా కుటుంబ సభ్యుడిగా సొంత రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తాను.  – లాబాల పవన్‌ కళ్యాణ్, టైర్‌ బిల్డింగ్‌–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్‌ 

Advertisement

What’s your opinion

Advertisement