
జమ్ము: కొంగొత్త ఆశలతో ఆరేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేబినెట్ ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలపడంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మార్చి మొదటి వారంలో తొలి అసెంబ్లీ సమావేశాలకు సమయాత్తమవుతుంది. అసెంబ్లీ సమావేశాలు మార్చి 3నుండి ప్రారంభమై 21 రోజుల పాటు జరగనున్నాయి.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 21న ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన జమ్మూకశ్మీర్ కేబినెట్ మార్చి మొదటి వారం నుంచి సెషన్‌ను నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు సిన్హా ఆమోదం తెలిపారని, మార్చి మొదటి వారంలో సెషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
లెఫ్టినెంట్ గవర్నర్ మార్చి 3 నుంచి తొలి రాష్టబడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు స్పీకర్ రహీమ్ రాథర్‌తో సంప్రదింపులు జరిపారు. ఇరువురి చర్చల అనంతరం అసెంబ్లీ కార్యదర్శి తెలియజేస్తారని, సమావేశాల ప్రారంభ తేదీ,వ్యవధిని చర్చిస్తారని సమాచారం. కాగా, జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ లేకపోవడంతో మునుపటి ఐదు బడ్జెట్‌లను పార్లమెంటు ప్రవేశపెట్టింది. అయితే పీడీపీ-బీజేపీ ప్రభుత్వం పతనం తర్వాత అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ నేతృత్వంలోని 2019-2020 బడ్జెట్‌ను ఆమోదించింది.