బెంగళూరు: శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన రెండు రోజులకే భారత క్రికెటర్లంతా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) బాట పట్టారు. సెప్టెంబర్ రెండో వారంతో మొదలు పెట్టి ఐపీఎల్ వరకు రాబోయే ఎనిమిది నెలల పాటు టీమిండియా ప్లేయర్లంతా బిజీగా ఉండనున్నారు. దాంతో సుదీర్ఘ సీజన్‌కు ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయిని పరీక్షించడంపై బోర్డు దృష్టి పెట్టింది. దాంతో బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లంతా సీఓఈలో వేర్వేరు పరీక్షలకు హాజరయ్యారు. టి20 టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కీపర్ రిషభ్ పంత్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలతో పాటు సంజు సామ్సన్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ కూడా ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.
ఫిట్‌నెస్ మార్కర్ల మధ్య నుంచి పరుగెడుతూ ఐదున్నర నిమిషాల వ్యవధిలో కనీసం 1200 మీటర్లు పూర్తి చేయాల్సిన ‘బ్రాంకో టెస్టు’, 10 నిమిషాల్లో పూర్తి చేస్తే 2 కిలోమీటర్ల పరుగు, మొత్తంగా కనీసం 16.5 పాయింట్లు స్కోర్ చేయాల్సిన యో యో టెస్టుల ద్వారా క్రికెటర్లు తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారు. గాయాలనుంచి ఇంకా పూర్తిగా కోలుకోని బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి ఇంకా ఈ ఫిట్‌నెస్ పరీక్షల్లో పాల్గొనలేదు. వీరంతా ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉండగా... ప్రిన్స్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు.


