టీ20 కెప్టెన్‌గా తొలగింపు.. ఎట్టకేలకు స్పందించిన సూర్య | I was disappointed: Suryakumar Yadav Ends Silence On T20I Sacking | Sakshi
Sakshi News home page

జట్టులోనే స్థానం లేదు: సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలు వైరల్‌

Aug 29 2026 10:51 AM | Updated on Aug 29 2026 11:25 AM

I was disappointed: Suryakumar Yadav Ends Silence On T20I Sacking

వరల్డ్‌కప్‌ ట్రోఫీతో సూర్యకుమార్‌ (PC: ICC X)

భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మొట్టమొదటగా 2007లో ప్రవేశపెట్టిన ఈ టోర్నీలో మహేంద్ర సింగ్‌ ధోని టీమిండియాను విజేతగా నిలపగా.. 2024లో రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత్‌ మరోసారి పొట్టి ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడింది.

సూర్యపై వేటు
ఇక ఈ ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో సూర్య టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. అయితే, అనూహ్య రీతిలో సూర్యపై వేటు పడింది. ప్రపంచకప్‌ తర్వాత భారత్‌ ఆడిన తొలి సిరీస్‌ నుంచే యాజమాన్యం అతడిని తప్పించింది. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు.. జట్టులోనూ స్థానం లేకుండా చేసింది.

ఈ విషయంపై సూర్యకుమార్‌ యాదవ్‌ తాజాగా స్పందించాడు. తాను కనీసం ఇంకో రెండేళ్ల వరకు టీమిండియాను ముందుకు నడిపిస్తాననే ధీమాతో ఉన్నట్లు తెలిపాడు. కానీ అంతలోనే మేనేజ్‌మెంట్‌ నుంచి ఇలాంటి నిర్ణయం వెలువడిందని పేర్కొన్నాడు. భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

మరో రెండేళ్ల పాటు..
‘‘ఆరోజు జట్టులో నా పేరు లేదు. అది చూడగానే నా పెదవులపైకి నవ్వు వచ్చింది. నేను దేశం కోసం ఆడుతున్న సమయంలో ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి ఉందనిపించినా.. పరిస్థితులు నా చేయి దాటిపోతున్నాయని అనిపిస్తున్నా.. అప్పుడూ ఇలాగే నవ్వు వస్తుంది. ముందుగా నేను రిలాక్స్‌ అవుతాను.

గతంలో నాకు వచ్చిన అవకాశాలు.. వాటిని సద్వినియోగం చేసుకున్న తీరును గుర్తు చేసుకుంటాను. తద్వారా ఒత్తిడిని జయించే ప్రయత్నం చేస్తాను. నాకు దక్కినవాటికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అలాగే.. కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు కూడా నేను ఇలాగే ఆలోచించాను.

2026 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత.. మరో రెండేళ్ల పాటు జట్టుకు నాయకుడిగా ఉంటానని అనిపించింది. ఒలింపిక్స్‌-2028లో నేను జట్టును ముందుకు నడిపిస్తాను.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌-2028లోనూ ఆడతానని అనిపించింది. అయితే, అందరి ఆలోచనలూ ఒకేలా ఉండవు కదా!

ఇది పూర్తిగా వాళ్ల నిర్ణయమే
వాళ్లు (సెలక్టర్లు) తమ ఆలోచనలను గౌరవించడంతో పాటు.. వాటిని అమలు చేయడం అత్యంత ముఖ్యం. నన్ను కాదని వాళ్లు ముందుకు వెళ్లాలని అనుకున్నపుడు తమకు నచ్చిన నిర్ణయం తీసుకుంటారు. కానీ నేను అందుకు పెద్దగా స్పందించలేదు.

ఎందుకంటే ఇది వాళ్ల నిర్ణయం వాళ్లు ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. వేరే ఆటగాడి సారథ్యంలో జట్టును నడిపించాలని వాళ్లు అనుకున్నారు. అతడి కెప్టెన్సీలో జట్టు మంచి విజయాలు సాధిస్తే ఎలాంటి సమస్యా రాదు. వాళ్లు శ్రేయస్‌ను ఎంచుకున్నారు.

నిరాశకు లోనయ్యా
అతడితో కలిసి నేను దేశీ క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. అతడొక మంచి క్రికెటర్‌. మంచి మనిషి. మంచి కెప్టెన్‌ కూడా!.. కాబట్టి.. ‘ఇతడిని ఎందుకు కెప్టెన్‌ను చేశారు’ అనే ప్రశ్న నా మదిలోకి రాలేదు. అయితే, నన్ను కెప్టెన్‌గా తొలగించడం పట్ల నిజంగానే నిరాశ చెందాను.

రెండేళ్లుగా నేను ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోలేదు. ప్రపంచకప్‌, ఆసియా కప్‌ గెలిచాను. ఇదే తరహాలో ముందుకు వెళ్లాలని భావించాను. కానీ అకస్మాత్తుగా ఇలా ఎందుకు చేశారు? కెప్టెన్‌ను మార్చడానికి గల కారణం ఏమిటి? అనే ప్రశ్నలు నా మెదడును తొలచివేశాయి. ఈ ఆలోచనలతో దాదాపు నెలన్నరపాటు ఇంట్లోనే ఉండిపోయాను’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ తన మనసులోని ఆవేదనను బయటపెట్టాడు. 

అదే విధంగా సారథ్య మార్పు గురించి సెలక్టర్లు తనకు చెప్పినపుడు.. ఈ నిర్ణయంతో తనకు ఎలాంటి సమస్యా లేదని చెప్పినట్లు సూర్య తెలిపాడు. మున్ముందు ఎప్పుడు పిలిచినా వచ్చి ఆడతానని వారితో అన్నట్లు పేర్కొన్నాడు.

కెప్టెన్‌గా హిట్‌.. బ్యాటర్‌గా విఫలం
కాగా కెప్టెన్‌ అయిన తర్వాత సూర్య బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఒకప్పుడు ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించిన అతడు.. నాయకత్వంపై దృష్టి పెట్టి.. ఆటగాడిగా విఫలమయ్యాడు. 

అదే విధంగా వయసు రిత్యా కూడా సూర్య (35 ఏళ్లు)ను ఎక్కువకాలం కొనసాగించలేమని సెలక్టర్లు భావించి ఉండవచ్చు.. అందుకే అతడిపై వేటు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక సూర్య స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ భారత కొత్త టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

కానీ తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది. యూకే పర్యటనలో పసికూన ఐరిష్‌ జట్టు చేతిలో భారత్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలోనూ 4-0తో వైట్‌వాష్‌ అయింది. అయితే, చివరగా జింబాబ్వే పర్యటనలో మాత్రం 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

చదవండి: నో శ్రేయస్‌.. నో వైభవ్‌? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement