శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్, మానవ్ సుతార్ విశేషంగా రాణించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పడిక్కల్ 3 ఇన్నింగ్స్‌ల్లో 109.33 సగటున, 2 సెంచరీల సాయంతో 328 పరుగులు చేయగా.. సుతార్ ఏకంగా 108.2 ఓవర్లు వేసి 16 వికెట్లు పడగొట్టాడు.
ఈ స్థాయిలో సత్తా చాటినా వీరిద్దరికి ఓ విషయంలో నిరాశ మిగిలింది. టీమిండియా మేనేజ్‌మెంట్ ఇటీవల ప్రవేశ పెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు వీరిలో ఎవరికీ దక్కలేదు. ఆశ్చర్యకరంగా ఈ అవార్డును ప్రసిద్ద్ కృష్ణ ఎగరేసుకుపోయాడు.
Prasidh Krishna won the Impact Player of the series vs Sri Lanka ❤️
- Prasidh bowled his heart out for the country. pic.twitter.com/GpPUUkyrNC— Johns. (@CricCrazyJohns) August 28, 2026
ఈ సిరీస్‌లో ప్రసిద్ద్ సుతార్ స్థాయిలో వికెట్లు తీయలేనప్పటికీ.. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకు గణాంకాల కంటే పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడం, బ్యాటర్లపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ప్రసిద్ద్‌కు అవార్డును ప్రధానం చేసిన టీమిండియా పనితీరు విశ్లేషకుడు హరి ప్రసాద్ మోహన్ చెప్పకనే చెప్పాడు. 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డును టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అనధికారంగా అందజేస్తారు.
ఈ సిరీస్‌లో ప్రసిద్ద్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 24,57 సగటున 7 వికెట్లు పడగొట్టాడు. రెండు టెస్టుల్లో ప్రసిద్ద్ మరో పేసర్ సిరాజ్ కంటే అధికంగా శ్రమించాడు. ఈ సిరీస్ మొత్తంలోనూ ప్రసిద్ద్ సిరాజ్ కంటే ఎక్కువ ఓవర్లు వేశాడు.
కాగా, శ్రీలంకతో సిరీస్‌లో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన పడిక్కల్‌కు అధికరిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన సుతార్‌కు ఎలాంటి అవార్డు లభించినప్పటికీ అందరి మన్ననలు అందుకున్నాడు.
పడిక్కల్, సుతార్, ప్రసిద్ద్‌లతో పాటు ప్రతి ఒక్క ప్లేయర్ తలో చేయి వేయడంతో భారత్ శ్రీలంక గడ్డపై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో టెస్ట్‌లో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినుషా అనూహ్యంగా ప్రతిఘటించడంతో ఆ మ్యాచ్ డ్రా అయ్యింది.


