రూ. 50 లక్షల నజరానా ఎందుకంటే? | 5th Place In WC - Hockey India Announces Big Reward for Women Team, Why? | Sakshi
Sakshi News home page

ఐదో స్థానం.. అయినా రూ. 50 లక్షల నజరానా ఎందుకంటే?

Aug 29 2026 11:38 AM | Updated on Aug 29 2026 11:56 AM

5th Place In WC - Hockey India Announces Big Reward for Women Team, Why?

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు ఐదో స్థానంలో నిలిచింది. సెమీ ఫైనల్‌ చేరడంలో విఫలమైనప్పటికీ.. జర్మనీతో మ్యాచ్‌లో మాత్రం సలీమా టెటె బృందం సత్తా చాటింది. ఐదు, ఆరో స్థానం కోసం జరిగిన వర్గీకరణ పోటీలో పటిష్ట జర్మనీని 3-1తో ఓడించింది.

52 ఏళ్ల తర్వాత 
తద్వారా ఐదో స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. కాగా 1974లో తొలిసారి నిర్వహించిన హాకీ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమంగా నాలుగోస్థానంలో నిలిచిన భారత జట్టు మళ్లీ 52 ఏళ్ల తర్వాత మెరుగైన ప్రదర్శన చేసింది. ర్యాంకింగ్‌ పరంగా తొమ్మిదో స్థానంలో ఉన్న మహిళల జట్టు.. ఐదో ర్యాంకులో ఉన్న జర్మనీని ఓడించి సత్తా చాటింది.

ఒకే ఒక్క ఓటమి
ఇక ఈ మెగా ఈవెంట్‌లో పూల్‌ ‘డి’ నుంచి భారత మహిళా జట్టు బరిలోకి దిగింది. సౌతాఫ్రికాపై 6-1తో అద్భుత విజయం సాధించిన సలీమా టెటె బృందం.. తొలి దశలో అగ్రశ్రేణి జట్లు చైనా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. అయితే, రెండో దశలో డిఫెండింగ్‌ చాంపియన్‌ నెదర్లాండ్స్‌ చేతిలో మాత్రం భారత జట్టు ఓడిపోయింది.  

ఈ క్రమంలో సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డ భారత్‌.. ‘డ్రా’కు పరిమితమైంది. ఫలితంగా సెమీస్‌కు దూరమైంది. ఇదిలా ఉంటే.. రెండుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన జర్మనీని ఓడించి ఐదో స్థానంలో నిలిచి.. అత్యుత్తమ ప్రదర్శనతో మెరిసింది. 

రూ. 50 లక్షల నజరానా.. అందుకే
ఈ నేపథ్యంలోనే హాకీ ఇండియా (HI) భారత మహిళా జట్టుకు ప్రోత్సాహకంగా రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. అదే విధంగా.. వరల్డ్‌కప్‌లో చక్కటి ఆటతీరు కనబర్చిన ప్లేయర్లను హెచ్‌ఐ అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ అభినందించారు. ‘‘భారత మహిళ హాకీ చరిత్రలో ఇదొక గొప్ప ఫలితం. దాదాపు 52 ఏళ్ల తర్వాత తొలిసారి జట్టు ఐదో స్థానం కైవసం చేసుకుంది. 

పట్టుదల, వైఫల్యాల నుంచి త్వరగా తేరుకునే తత్వం, పోరాట పటిమకు ఈ జట్టు నిదర్శనం. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్నారు. హాకీ ఇండియా తరఫున.. జట్టును ప్రశంసిస్తూ రూ. 50 లక్షల నజరానా ప్రకటిస్తున్నాం. ఆటగాళ్లు ప్రతీసారి ఇలాగే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఇది ఒక ప్రోత్సాహకం లాంటిది’’ అని దిలీప్‌ టిర్కీ పేర్కొన్నారు. 

చదవండి: నాకు జట్టులోనే స్థానం లేదు.. నవ్వుకున్నా: సూర్యకుమార్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement