source: X
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వివాదాస్పద వ్యాఖ్యాత మైఖేల్ ఆథర్టన్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాక్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. 'సెకండ్ డివిజన్ కౌంటీ జట్టు' అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. పాక్ ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రమాణాలు టెస్టు స్థాయికి తగ్గట్టుగా లేవని ధ్వజమెత్తాడు.
పాక్ బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించాడు. పాక్ బ్యాటర్లలో ప్రత్యర్ది బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే సామర్థ్యం కనిపించడం లేదని, అందుకే ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీయడానికి పోటీ పడుతున్నారని అన్నాడు.
ఇదే సమయంలో అతడు ఇంగ్లండ్ పేసర్లను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇదే ఫామ్‌ను వారు కొనసాగిస్తే భవిష్యత్తులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన బ్యాటింగ్ జట్లను ఇబ్బంది పెట్టగలరని అభిప్రాయపడ్డాడు.
కాగా, ఆగస్టు 27న ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 81-3 స్కోర్ వద్ద కొనసాగిస్తుంది.
దీనికి ముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే ఆలౌటైంది. ఓలీ రాబిన్సన్ (4-11), ఆర్చర్ (3-26), టంగ్ (2-27) పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. పాక్జ జట్టులో అజాన్ అవైస్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌద్ షకీల్ 16 పరుగులు చేశాడు.
వీరు మినహా జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
చదవండి: పాఠాలు నేర్వని పాక్.. ఇంగ్లండ్ దెబ్బకు 110 రన్స్‌కే ఆలౌట్


