కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఫాలో- ఆన్‌లో ఆతిథ్య జట్టును ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికి.. యువ బ్యాటర్ సోనల్ దినుష అద్భుతంగా పోరాటం కారణంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఐదో రోజు ఆట ప్రారంభానికి శ్రీలంక చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేసి భారత్ మ్యాచ్‌ను ముగిస్తుందని అంతా భావించారు. కానీ ఆఖరి రోజు ఆటలో కథ తారుమారైంది. దినుషతో పాటు టెయిలాండర్లు క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌ను ముగించలేకపోయాడు. ఆఖరికి గిల్ కూడా రంగంలోకి దిగి బౌలింగ్ చేశాడు. చివరి వికెట్ పడగొట్టేందుకు పార్ట్-టైమ్ స్పిన్నర్‌గా మారిన గిల్.. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు ఇచ్చాడు. వికెట్ ఏమీ తీయనప్పటికీ గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
గత 18 ఏళ్లలో శ్రీలంక గడ్డపై బౌలింగ్ చేసిన తొలి భారత టెస్టు కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 2008 లంక టూర్‌లో అప్పటి భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే బౌలింగ్ చేశాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే సరసన శుబ్‌మన్ చేరాడు.
చదవండి: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. ఆట బాయ్‌కట్ చేస్తామంటూ పాక్ బెదరింపులు!


