భారత జట్టులో వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌.. కారణమిదే? | Why Was Vaibhav Sooryavanshi Not Selected In India U-19 Squad? | Sakshi
Sakshi News home page

భారత జట్టులో వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌.. కారణమిదే?

Aug 28 2026 11:15 AM | Updated on Aug 28 2026 11:39 AM

Why Was Vaibhav Sooryavanshi Not Selected In India U-19 Squad?

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే యూత్‌ వన్డే సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో భారత దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్‌ ద్రవిడ్‌ల కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్‌ ద్రవిడ్‌లకు చోటు దక్కింది. ఇప్పటికే అన్వయ్‌ భారత అండర్‌-19 జట్టు తరఫున ఆడినప్పటికీ, ఆర్యవీర్‌ ఎంపిక కావడం ఇదే తొలిసారి. 

అయితే ఈ జట్టులో భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కలేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసి సత్తా చాటిన వైభవ్‌కు ఈ జూనియర్‌ జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సూర్యవంశీని ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది.

బీసీసీఐ 2016లో ఒక కీలక నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రూల్‌ ప్రకారం.. వయస్సు పరంగా అర్హత ఉన్నప్పటికీ ఆటగాళ్లు కేవలం ఒక్క అండర్-19 ప్రపంచకప్‌లో మాత్రమే పాల్గొనాలి. సూర్యవంశీ ఇప్పటికే 2026 అండర్-19 ప్రపంచకప్‌లో ఆడాడు. దీంతో అతడు మరో ఎడిషన్‌లో పాల్గొనేందుకు అర్హుడు కాదు. అందుకే అతడిని అండర్‌-19 ప్రణాళికల నుంచి సెలక్టర్లు పక్కన పెట్టారు.

ఇకపై సూర్యవంశీ అండర్‌-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించడు. గతంలో ఈ నిబంధన కారణంగానే ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ 2018 అండర్-19 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే ఈ రూల్‌ అమలులోకి రాకముందు సర్ఫరాజ్ ఖాన్, సందీప్ శర్మ, విజయ్ జోల్ వంటి ఆటగాళ్లు రెండుసార్లు అండర్-19 ప్రపంచకప్‌లు ఆడారు. సూర్యవంశీ ప్రస్తుతం భారత సీనియర్‌ జట్టు తరఫున స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు.

భారత అండర్‌–19 వన్డే జట్టు: లక్ష్య రాయ్‌చందాని (కెప్టెన్‌), యశ్‌వర్ధన్‌ చౌహాన్, రజత్‌ బఘేల్, ఆర్యవీర్‌ సెహ్వాగ్, వీకే వినీత్, కుషాగ్ర ఓజా, అర్జున్‌ రాజ్‌పుత్, మనాల్‌ చౌహాన్, అన్వయ్‌ ద్రవిడ్, యశ్‌వీర్, రోహిత్‌ యాదవ్, షవిన్‌ వినోద్, మోహిత్‌ ఉల్వా, చిగురుపాటి వెంకటనాగ విజయ సుభాశ్, కావ్య పటేల్‌.

భారత్‌ అండర్‌–19 టెస్టు జట్టు: యశ్‌వర్ధన్‌ చౌహాన్‌ (కెప్టెన్‌), లక్ష్య రాయ్‌చందాని, సాగర్‌ విర్క్, కుషాగ్ర ఓజా, మనాల్‌ చౌహాన్, కుష్‌ పటేల్, మానవ్‌ కృష్ణ, అభిప్రాయ్‌ విశ్వాస్, రోహిత్‌ యాదవ్, ఇషాన్‌ ఓం, అయాన్‌ అక్రమ్, ప్రణవ్‌ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్‌ ఉల్వా, ఆర్యన్‌ యాదవ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement