నో శ్రేయస్‌, నో వైభవ్‌.. నిర్ణయం మార్చుకున్న బీసీసీఐ! | BCCI To Change India T20 Squad For Asian Games After Anger: Report | Sakshi
Sakshi News home page

BCCI: నో శ్రేయస్‌, నో వైభవ్‌.. నిర్ణయం మార్చుకున్న బీసీసీఐ!

Aug 28 2026 3:46 PM | Updated on Aug 28 2026 4:00 PM

BCCI To Change India T20 Squad For Asian Games After Anger: Report

వైభవ్‌ సూర్యవంశీ (PC: BCCI)

ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్‌కు పంపే జట్టు విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సందిగ్దంలో పడినట్లు సమాచారం. జపాన్‌లో జరిగే ఈవెంట్‌కు ద్వితీయ శ్రేణి జట్టును పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను తొలగించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.

అయ్యర్‌ కెప్టెన్సీలో
ఈ క్రమంలో జూన్‌లోనే శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో ఆసియా క్రీడల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్‌ వర్మను వైస్‌ కెప్టెన్‌గా నియమించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీని కూడా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌ మొదలుకానుంది.

తీవ్ర అసంతృప్తి!
జపాన్‌లోని ఐచి నగోయా ఇందుకు వేదిక. అయితే, అక్కడ క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి సరైన వసతులు ఇంకా ఏర్పాటు చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్‌ మండలి సైతం జపాన్‌లోని క్రీడా వేదిక వద్ద ఉన్న సదుపాయాలతో సంతృప్తిగా లేదు.

అందుకే ముందుగా అక్కడికి ఒక అబ్జర్వర్‌ను పంపించాలనకుంటున్నాయి. అబ్జర్వర్‌ నుంచి నివేదిక వచ్చిన తర్వాతే జట్టు మార్పు విషయంలో నిర్ణయం ఉంటుంది. ఒకవేళ సరైన వసతులు అక్కడ లేనట్లయితే.. ద్వితీయ శ్రేణి జట్టును పంపే అవకాశం ఉంది.

మరీ టెంట్లలోనా?
ఈ విషయం గురించి ఇప్పటికే మేము జపాన్‌ ఒలింపిక్స్‌ అధికారులతో మాట్లాడాము. డ్రెసింగ్‌రూమ్‌లను టెంట్లలో ఏర్పాటు చేశారు. వాష్‌రూమ్‌లు టెంట్లకు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. హోటల్‌ గదులు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలు. ఆటగాళ్లు కచ్చితంగా అసంతృప్తికి లోనవుతారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

అందుకే బి- టీమ్‌?
ఇక పిచ్‌ కూడా అత్యంత నాసిరకంగా ఉందని బీసీసీఐతో పాటు పాకిస్తాన్‌ బోర్డు ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ను కనీసం రెండు వేల మంది ప్రేక్షకులు అయినా వీక్షించేలా స్టేడియం ఉండాలి. కానీ జపాన్‌లో అలాంటి పరిస్థితి లేదని సమాచారం. 

ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తమ ద్వితీయ శ్రేణి జట్లను పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గత ఆసియా క్రీడల ఎడిషన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలో పురుషుల జట్టు.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో మహిళా జట్టు స్వర్ణ పతకాలు సాధించాయి.

ఆసియా క్రీడలకు భారత పురుషుల టీ20 జట్టు
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శివం దూబే, తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ కుమార్‌రెడ్డి, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయి, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వైభవ్‌ సూర్యవంశీ, జస్‌ప్రీత్‌ బుమ్రా.

మహిళల టీ20 జట్టు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), జి.కమలిని (వికెట్‌ కీపర్‌), భారతి ఫుల్మలి, శ్రీచరణి, రేణుకా ఠాకూర్‌, క్రాంతి గౌడ్‌, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌, రాధా యాదవ్‌, నందిని శర్మ.

చదవండి: భారత జట్టులో లేని వైభవ్‌.. కారణం ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement