జ‌కోవిచ్.. ప్లీజ్ రిటైరవ్వు; ఇలా చూడ‌లేక‌పోతున్నాం! | Fans-Emotional-Time-To-Retire-DJokovic-Exit-1st-Round-US-Open 2026 | Sakshi
Sakshi News home page

జ‌కోవిచ్.. ప్లీజ్ రిటైరవ్వు; ఇలా చూడ‌లేక‌పోతున్నాం!

Aug 31 2026 4:41 PM | Updated on Aug 31 2026 4:57 PM

Fans-Emotional-Time-To-Retire-DJokovic-Exit-1st-Round-US-Open 2026

Photo Credit: Twitter

సెర్బియా టెన్నిస్ దిగ్గ‌జం నొవాక్ జ‌కోవిచ్ ఆట‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల్సిన స‌మ‌యం వ‌చ్చేసిందా? అత‌డిని చూస్తుంటే ఆ సిగ్న‌ల్స్ వచ్చేసినట్లుగా అనిపిస్తున్నాయి. తాజాగా సీజ‌న్ చివ‌రి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో జ‌కోవిచ్ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట ప‌ట్టాడు. అర్జెంటీనాకు చెందిన మ‌రియానో న‌వోనె చేతిలో 7-6 (7-5), 5-7, 4-6, 6-2, 6-1తో జ‌కోవిచ్ ఓట‌మిపాల‌య్యాడు. 

దాదాపు నాలుగున్న‌ర గంట‌ల పాటు సాగిన పోరులో అల‌సిపోయిన‌ట్లు క‌నిపించిన జ‌కోవిచ్ మ‌రోసారి అధిక ఉష్ణోగ్ర‌త‌కు తాళ‌లేక మైదానంలోనే వాంతి చేసుకోవ‌డం అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఒక‌ప్పుడు ఫిట్‌నెస్‌కు మారుపేరైన జ‌కోవిచ్ ఇప్పుడు వ‌య‌సు మీద ప‌డుతుండ‌డంతో శ‌రీరం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.


Photo Credit: Twitter

అభిమానుల కన్నీటిపర్యంతం
20 ఏళ్లలో జ‌కోవిచ్ ఒక మేజ‌ర్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్‌లో ఓట‌మి పాల‌వ్వ‌డం ఇదే తొలిసారి. 2006లో జ‌కోవిచ్ 18 ఏళ్ల వ‌య‌సులో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లో వెనుదిరిగాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు జ‌కోవిచ్ ఒక మేజ‌ర్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్‌లో ఇంటిబాట ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. తొలి రౌండ్‌లో ఓట‌మి అనంత‌రం గ్రౌండ్‌లోనే క‌న్నీటి ప‌ర్యంతమ‌యిన జ‌కోవిచ్ భావోద్వేగంతో మైదానం వీడ‌డం అంద‌రినీ క‌లచివేసింది. క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని అభిమానులంతా బ‌య‌టికి అరుస్తూ చెప్పిన‌ప్ప‌టికీ, లోప‌ల మాత్రం ఆ సెర్బియా యోధుడు రిటైర్ అయితేనే బాగుంటుంద‌ని భావిస్తున్నారు.


Photo Credit: Twitter

మూడేళ్లుగా 25వ టైటిల్‌ కోసం
టెన్నిస్ ఓపెన్ శ‌కంలో పురుషుల సింగిల్స్ విభాగంలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచాడు జకోవిచ్‌. త‌న స‌మ‌కాలీకులు రోజ‌ర్ ఫెద‌రర్‌, ర‌ఫేల్ నాద‌ల్ రిటైరన‌ప్ప‌టికీ, తాను మాత్రం ఒక యోధుడిలా ఆడుతూనే ఉన్నాడు. త‌న 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం మూడేళ్లుగా చ‌కోర ప‌క్షిలా ఎదురుచూస్తూనే వ‌స్తున్నాడు. ఆడ‌డం లేదా అంటే అత‌డి ఆట‌కు వంక పెట్టాల్సిన ప‌ని లేదు. 2026 ఏడాది సీజ‌న్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జ‌కోవిచ్‌.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లో వెనుదిరిగాడు. అయితే వింబుల్డ‌న్‌లో సెమీస్‌లో ఇంటిబాట ప‌ట్టాడు. 

ఆట‌కు వంక పెట్ట‌లేక‌పోయినా, వ‌య‌సు అత‌డి అనారోగ్యాన్ని సూచిస్తుంది. 39 ఏళ్ల జ‌కోవిచ్ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డుతున్నాడు. ఏడాది కాలం నుంచి చూసుకుంటే జ‌కోవిచ్ శ‌రీరం ఆట‌కు స‌హ‌క‌రించట్లేద‌నిపిస్తోంది. గ‌తేడాది షాంఘై మాస్ట‌ర్స్ టోర్నీ స‌మ‌యంలోనూ జ‌కోవిచ్ మైదానంలో వాంతి చేసుకున్నాడు. అప్ప‌టి నుంచి త‌ర‌చూ వేడికి త‌ట్టుకోలేక అల‌స‌ట‌కు గురవుతున్న జ‌కోవిచ్ మైదానంలోనే వాంతులు చేసుకోవ‌డం చూసి అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఇదంతా చూడ‌డం కంటే జ‌కోవిచ్ త‌న కెరీర్‌కు గౌర‌వ‌ప్ర‌దంగా వీడ్కోలు ప‌ల‌క‌డం న‌య‌మ‌నే అభిప్రాయానికి వ‌చ్చేశారు.


Photo Credit: Twitter

2023లో పూర్వవైభవం
2023 ఏడాది జ‌కోవిచ్ కెరీర్‌లో పీక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఒక్క ఏడాదిలోనే మూడు మేజ‌ర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్‌, ఫ్రెంచ్ ఓపెన్‌, యూఎస్ ఓపెన్‌) నెగ్గిన వింబుల్డ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. అది కూడా సాధించి ఉంటే ఆ ఏడాది జ‌కోవిచ్ మ‌రోసారి కెరీర్ గ్రాండ్‌స్లామ్ (నాలుగు టైటిల్స్‌) ఫీట్ సాధించేవాడే.

డౌన్‌ఫాల్‌.. అనారోగ్యం
2023 త‌ర్వాత జ‌కోవిచ్ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయ్యింది. అప్ప‌టినుంచి ఇప్ప‌టిదాకా ఒక‌టి రెండు మేజ‌ర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీస్ లేదా ఫైనల్‌కు చేరుకున్నాడు త‌ప్పిస్తే మునుప‌టి ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మిన‌హా జ‌కోవిచ్ మిగ‌తా గ్రాండ్‌స్లామ్స్‌లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు.


Photo Credit: Twitter

2022లో ఫెదరర్‌.. 2024లో నాదల్‌
త‌న కెరీర్‌లో 25 గ్రాండ్‌స్లామ్స్‌తో టెన్నిస్‌లో అత్యున్న‌త శిఖ‌రాన్ని అధిరోహించాల‌ని భావిస్తున్న జ‌కోవిచ్ ప‌ట్టువ‌ద‌లని విక్ర‌మార్కుడిలా త‌న ప్ర‌యత్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నాడు. కానీ జ‌కోవిచ్ ప్ర‌స్తుతం త‌న వ‌య‌సును కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన త‌ర్వాత స్విస్ దిగ్గ‌జం రోజర్ ఫెద‌ర‌ర్ 2022లో త‌న సేవ‌లు చాలు అనుకొని టెన్నిస్‌కు వీడ్కోలు ప‌లికాడు. 

ఆ త‌ర్వాత రెండేళ్లకు అంటే 2024లో స్పెయిన్ బుల్ ర‌ఫేల్ నాద‌ల్ (22 టైటిల్స్‌) కూడా ఆడాల‌నే ప‌ట్టుద‌ల ఉన్న‌ప్ప‌టికీ, శ‌రీరం స‌హ‌క‌రించ‌డం లేద‌న్న కార‌ణంతో అత‌డు కూడా త‌ప్పుకున్నాడు. ఇప్పుడు 24 టైటిల్స్‌తో వీరిద్ద‌రి కంటే ముందున్న జ‌కోవిచ్ కూడా త‌న భ‌విష్య‌త్తుపై నిర్ణ‌యం తీసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందని చెప్పొచ్చు.


Photo Credit: Twitter

13 ఏళ్ల పాటు నంబ‌వ‌ర్‌వ‌న్‌గా..
ఇక 23 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో జ‌కోవిచ్ సింగిల్స్ రికార్డు 1177–240 (83.1శాతం)గా ఉంది. అత‌డి కెరీర్‌లో 101 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్‌తో పాటు రికార్డు స్థాయిలో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో రికార్డు స్థాయిలో 10 ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌, మూడు ఫ్రెంచ్ ఓపెన్‌, ఏడు వింబుల్డ‌న్, నాలుగు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో ఉన్నాయి. ఇక వ‌రుస‌గా 13 ఏళ్లు వివిధ స‌మ‌యాల్లో నెంబ‌ర్‌వ‌న్‌గా కొన‌సాగిన జ‌కోవిచ్‌, అత్య‌ధికంగా 428 వారాల పాటు నంబ‌ర్‌వ‌న్ ర్యాంకులో కొన‌సాగడం విశేషం.

 

చదవండి: గాయం పేరుతో నాట‌కమా? నిజ‌మ‌ని తేలితే నిషేధ‌మే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement