PC: ECB X
పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ నాసిర్ హుసేన్ ఘాటు విమర్శలు చేశాడు. అసలు ఇలాంటి జట్టుపై గెలవడం పెద్ద కష్టమేమీ కాదని.. ఇప్పటికైనా సంబరాలు మానుకోవాలని జో రూట్ బృందానికి సూచించాడు. స్థాయికి తగ్గ జట్లపై విజయాలు సాధించడం మాత్రమే ముఖ్యమంటూ పాక్ పరువు తీశాడు.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ మీద 103 పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లండ్ పాక్‌ను మట్టికరిపించింది. ఇక లార్డ్స్ వేదికగా రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టు బాబర్ ఆజం బృందాన్ని 194 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్ రేసు నుంచి పాక్ దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ బాబర్ ఆజం బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
పోస్ట్ మ్యాచ్ ఎక్స్‌పర్ట్ కామెంట్రీ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ జట్టు పాకిస్తానీ బ్యాటింగ్ లైనపై విజయం ద్వారా తమ ప్రతిభను అంచనా వేయొద్దు. నేను ప్రతీసారి చెబుతున్న మాటే ఇది. పాకిస్తాన్ చాలా చాలా బలహీనమైన జట్టు.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రియా, ఇండియా వంటి జట్లతో మ్యాచ్‌ల ఫలితాలను బట్టి మాత్రమే ఇంగ్లండ్ జట్టు తమను తాము అంచనా వేసుకోవాల్సి ఉంటుంది’’ అని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. ఇక ఓటమి అనంతరం తాము తిరిగి పుంజుకుంటామని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై నాసిర్ హుసేన్ స్పందిస్తూ.. పాకిస్తాన్ ఎప్పటికీ తిరిగి పోరాడలేదని కుండబద్దలు కొట్టేశాడు. పాక్ జట్టు మునుపటిలా లేదని.. అయినా సరే వారికి కొంతమంది అనవసరంగా ‘హైప్’ ఇస్తున్నారని పేర్కొన్నాడు. కనీసం మూడో టెస్టులోనైనా కాస్త మెరుగ్గా ఆడాలని బాబర్ బృందానికి సూచించాడు. కాగా ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు.. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


