వీనస్- కెనిన్ (Photo Credit: US Open Tennis X)
యూఎస్ ఓపెన్-2026లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే దిగ్గజ నొవాక్ జకోవిచ్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా.. తాజాగా అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా మొదటి రౌండ్‌లో సోఫియా కెనిన్‌తో తలపడ్డ వీనస్ వరుస సెట్లలో 6-2, 7-6 (6) తేడాతో ఓటమిపాలైంది.
కాగా జూలై 2025లో చివరిసారిగా సింగిల్స్ మ్యాచ్ గెలిచిన 46 ఏళ్ల వీనస్ విలియమ్స్‌కు ఇది వరుసగా 14వ ఓటమి కావడం గమనార్హం. అంతేకాదు 2019 తర్వాత వీనస్ తొలి రౌండ్‌లోనే వరుసగా ఓడిపోవడం ఇది ఆరోసారి. న్యూయార్క్‌లోని ఆర్థర్ స్టేడియంలో పురుషుల సింగిల్స్‌లో భాగంగా జకోవిచ్- మరియానో నవోనే మ్యాచ్ 4 గంటల 36 నిమిషాల పాటు సాగగా.. వీనస్- సోఫియా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది.
ఈ క్రమంలో ఆది నుంచే 27 ఏళ్ల సోఫియా వీనస్‌పై ఆధిపత్యం కనబరిచింది. కేవలం 32 నిమిషాల వ్యవధిలోనే ఆమె తొలి సెట్ గెలవడం ఇందుకు నిదర్శనం. అయితే, ఆ తర్వాత సోఫియా చేసిన తప్పులను తనకు అనుకూలంగా మార్చుకున్న వీనస్ సెకండ్ సెట్‌లో ఆకట్టుకుంది. కానీ ఆఖరికి సోఫియానే పైచేయి సాధించింది. కాగా అమెరికాకే చెందిన సోఫియా కెనిన్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2020లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచింది కెనిన్.


