ఐదు సెట్‌ల పోరులో సొనెగోపై విజయం
న్యూయార్క్: కాస్త అటు ఇటు అయి ఉంటే... యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మరో సంచలనం నమోదయ్యేది. ఇప్పటికే సెర్బియా దిగ్గజం, 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత జొకోవిచ్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా... టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా జొకోవిచ్ సరసన చేరేవాడు. కానీ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జ్వెరెవ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి ఓటమి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 4 గంటల 53 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో జ్వెరెవ్ 6–4, 3–6, 6–7 (7/9), 7–5, 6–4తో ప్రపంచ 89వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)పై కష్టపడి గెలుపొందాడు.
నాలుగో సెట్ పదో గేమ్‌లో జ్వెరెవ్ ఓటమికి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు. పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత లొరెంజో సర్వీస్‌ను బ్రేక్ చేసి 6–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. పన్నెండో గేమ్‌లో మళ్లీ తన సర్వీస్‌ను కాపాడుకొని జ్వెరెవ్ సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్‌లోని ఐదో గేమ్‌లో సొనెగో సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో తన 100వ విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో 12 ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్ 8 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 54 సార్లు దూసుకొచ్చి 38 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు.
61 విన్నర్స్ కొట్టిన ఈ జర్మనీ స్టార్ 39 అనవసర తప్పిదాలు చేశాడు. ఈ ఏడాది జ్వెరెవ్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకొని, ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ఫ్లావియో కొబోలి (ఇటలీ) 4 గంటల 13 నిమిషాల్లో 3–6, 2–6, 6–3, 6–4, 6–4తో ఫ్రాన్సిస్కో కమ్సానా (అర్జెంటీనా)పై శ్రమించి గెలిచాడు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవారెడ్డి తొలి రౌండ్‌లో 6–7 (4/7), 6–3, 4–6, 4–6తో ట్రిస్టన్ స్కూల్‌కేట్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో ఓడిన నిశేష్ కు 1,40,000 డాలర్లు (రూ. 1 కోటీ 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
మెద్వెదెవ్ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో 2021 చాంపియన్, 2019, 2023 రన్నరప్ మెద్వెదెవ్ (రష్యా) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ మెద్వెదెవ్ 6–1, 6–3, 7–5తో గోర్జ్‌నీ (అమెరికా)పై గెలుపొందాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో అలెక్స్ మిచెల్సన్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో 16వ సీడ్ బ్రాండన్ నకíÙమా (అమెరికా)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), 19వ సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పెగూలా 6–3, 6–1తో 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)పై, పావోలిని 6–4, 6–1తో తన దేశానికే చెందిన లుక్రెజియా స్టెఫానినిపై గెలుపొందారు.
బెన్‌చిచ్‌కు షాక్
మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. బెన్‌చిచ్ 2 గంటల 51 నిమిషాల్లో 6–4, 5–7, 3–6తో యూలియా పుతింత్‌సెవా (కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) అలవోక విజయాలతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో రిబాకినా 6–3, 6–2తో థియా ఫ్రోడిన్ (అమెరికా)పై, కోకో గాఫ్ 6–3, 6–4తో జెనెప్ సోన్‌మెజ్ (టర్కీ)పై, ఆండ్రీవా 6–2, 6–2తో జెనిస్ జెన్ (ఇండోనేసియా)పై నెగ్గారు.


