తొలి రౌండ్‌లోనే లక్ష్య సేన్ నిష్క్రమణ
షెన్‌జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురుకాగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ విక్టర్ లాయ్ (కెనడా)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్ 14–21, 7–21తో ఓడిపోయాడు. ఇటీవల భారత్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరిన విక్టర్ లాయ్ చేతిలో లక్ష్య సేన్ పరాజయం పొందడం ఇది మూడోసారి.
మరోవైపు ప్రపంచ 34వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 21వ ర్యాంకర్ చి యు జెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 35 నిమిషాల్లో 21–16, 21–15తో గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... దేవిక సిహాగ్ ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్‌లో తన్వీ శర్మ 21–16, 21–17తో అమేలియా షుల్జ్ (డెన్మార్క్)పై నెగ్గగా... దేవిక 18–21, 15–21తో కలోయానా నల్బంతోవా (బల్గేరియా) చేతిలో ఓడిపోయింది.
సాత్విక్–చిరాగ్ జోడీ ముందంజ
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ గెలుపు బోణీ కొట్టింది. తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–11, 21–16తో జునైది ఆరిఫ్–కాంగ్ ఖాయ్ జింగ్ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 16–21, 18–21తో వు గువాన్ జు–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–8, 21–9తో టాన్‌రుగ్ సహెంగ్–టాన్‌కిడ్ సహెంగ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.


