లక్ష్యసేన్, ప్రణయ్‌ నిష్క్రమణ | Disappointment for top Indian players Lakshya Sen and HS Prannoy at Malaysia Masters | Sakshi
Sakshi News home page

లక్ష్యసేన్, ప్రణయ్‌ నిష్క్రమణ

May 21 2026 4:01 AM | Updated on May 21 2026 4:01 AM

Disappointment for top Indian players Lakshya Sen and HS Prannoy at Malaysia Masters

మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌

కౌలాలంపూర్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సూపర్‌–500 టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు లక్ష్యసేన్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లోనే వీరిద్దరు నిష్క్రమించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ లక్ష్య సేన్‌ 17–21, 11–21 స్కోరుతో ప్రపంచ 38వ ర్యాంకర్‌ ఉబేదుల్లా (ఇండోనేసియా) చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. 

43 నిమిషాల్లో ఈ మ్యాచ్‌ ముగిసింది. మరో పోరులో ప్రణయ్‌ 17–21, 22–20, 22–24 తేడాతో ఆరో సీడ్‌ కొడై నరోకా (జపాన్‌) చేతిలో పోరాడి ఓడాడు. 80 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో రెండో గేమ్‌ గెలిచిన ప్రణయ్‌... చివరి గేమ్‌లో కూడా తీవ్రంగా శ్రమించినా లాభం లేకపోయింది. 

పురుషుల సింగిల్స్‌లోనే ప్రపంచ పదో ర్యాంకర్‌ అలెక్స్‌ లేనియర్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో భారత ఆటగాడు కిరణ్‌ జార్జ్‌ 15–21, 1–6తో వెనుకబడి ఉన్న దశలో గాయంతో రిటైర్డ్‌గా తప్పుకున్నాడు. తెలంగాణ ఆటగాడు తరుణ్‌ మన్నేపల్లి కూడా 21–17, 14–21, 8–21తో వాంగ్‌ వీ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడి తొలిరౌండ్‌లోనే వెనుదిరిగాడు. 

అస్మిత, మాళవిక ముందంజ... 
మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్‌ అస్మిత చాలిహా 21–16, 21–13తో తలిత రమదాని (ఇండోనేసియా)ని ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. మాళవిక బన్సోద్‌ కూడా 21–17, 16–21, 21–9తో వోన్‌ లీ (జర్మనీ)పై,  దేవిక సిహాగ్‌ 19–21, 21–18, 21–19తో పార్క్‌ యున్‌ (కొరియా)పై గెలుపొంది ముందంజ వేశారు. 

అయితే తాన్య హేమంత్‌ 19–21, 7–21తో హువాంగ్‌ చింగ్‌ పింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, అన్‌మోల్‌ ఖర్బ్‌ 21–13, 16–21, 19–21తో ఎనిమిదో సీడ్‌ లైన్‌ హోమార్క్‌ (డెన్మార్క్‌) చేతిలో, ఇషారాణి బారువా 17–21, 21–14, 18–21తో ఐదోసీడ్‌ లైన్‌ క్రిస్టోఫర్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో, తాన్వి శర్మ 10–21, 19–21తో పికమన్‌ ఒపటినిపుట్‌ చేతిలో పరాజయంపాలై నిష్క్రమించారు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ రెడ్డి–రాధిక శర్మ జోడి 16–21, 21–14, 21–18తో అలెగ్జాండర్‌ డున్‌ –జూలీ మ్యాక్‌సన్‌ (స్కాట్లాండ్‌)ను ఓడించి ముందంజ వేయగా... గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ జంట 15–21, 22–20, 10–21 స్కోరుతో అమ్రి స్యానవి–నీతా మార్వా (ఇండోనేసియా) చేతిలో పరాజయంపాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement