భారత్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలో కీలక మలుపు | A turning point in the history of Indian football | Sakshi
Sakshi News home page

భారత్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలో కీలక మలుపు

Sep 3 2026 3:52 AM | Updated on Sep 3 2026 3:53 AM

A turning point in the history of Indian football

అక్టోబర్‌ 3న బ్రెజిల్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న భారత్‌

2027 ఆసియా కప్‌ టోర్నీకి అర్హత సాధించడమే లక్ష్యమన్న కోచ్‌ జమీల్‌

న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ బ్రెజిల్‌తో సొంతగడ్డపై ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడనుండటం... భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో కీలక మలుపు కానుందని హెడ్‌ కోచ్‌ ఖాలిద్‌ జమీల్‌ అన్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్‌ టోర్నీకి అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు అంతకుముందు స్వదేశంలో పనామా, బ్రెజిల్, ఉరుగ్వే జట్లతో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనుంది. సాకర్‌ చరిత్రలో అత్యుత్తమ జట్లలో ఒకటిగా పేరున్న బ్రెజిల్‌ జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్‌ విజేతగా నిలవగా... ఉరుగ్వే రెండుసార్లు టైటిల్‌ కైవసం చేసుకుంది. అలాంటి మేటి జట్లతో తలపడితే... మన ప్లేయర్లు ఎంతో మెరుగయ్యే అవకాశం ఉందని జమీల్‌ పేర్కొన్నాడు.

‘అవును. ఇది భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యంత కీలక మైలురాయి. బ్రెజిల్‌తో ఇప్పటి వరకు భారత జట్టు తలపడలేదు. వారితో ఆడనుండటం ఇదే మొదటిసారి. సానుకూలంగా ముందుకు సాగుతూ మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. 2027 ఆసియా కప్‌ టోర్నీకి అర్హత సాధించడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. దానికి ముందు బలమైన జట్లతో ఆడనుండటం మాకు ఉపయోగపడుతుంది’ అని జమీల్‌ వెల్లడించాడు.  

ఈ నెల 26న బెంగళూరు వేదికగా పనామాతో భారత్‌ తలపడనుంది. అనంతరం అక్టోబర్‌ 3న కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో... అక్టోబర్‌ 6న ఉరుగ్వేతో టీమిండియా తలపడనుంది. ఇలాంటి కీలక సమయంలో విమర్శలను పక్కనపెట్టి అభిమానులంతా జట్టుకు అండగా నిలవాల్సిన అవసరముందని జమీల్‌ అన్నాడు. ‘భారత ఫుట్‌బాల్‌ చరిత్రలోనే ఇది కీలక మలుపు. ఈ సమయంలో ప్రతికూల విమర్శలను పక్కనపెట్టి... జట్టుకు మద్దతుగా నిలవాలి. ఈ మ్యాచ్‌లకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడం ఖాయం. 

సొంతగడ్డపై వారి ప్రోత్సాహం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అగ్రశ్రేణి జట్లతో ఆడుతున్నప్పుడు డిఫెన్స్, అటాకింగ్‌ రెండింటిలోనూ బలంగా ఉండాలి. ముఖ్యంగా ప్లేయర్లు ఫిట్‌నెస్‌ మరింత మెరుగు పరుచుకోవాలి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టడం చాలా ముఖ్యం. పెద్ద జట్లతో తలపడినప్పుడే ఆటగాళ్ల నైపుణ్యం, జట్టు వ్యూహాలు మెరుగవుతాయి’ అని జమీల్‌ వివరించాడు. భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య కృషితోనే బ్రెజిల్, ఉరుగ్వే, పనామా వంటి మెరుగైన ర్యాంక్‌ల్లో ఉన్న జట్లతో పోటీపడే అవకాశం దక్కిందని కోచ్‌ వెల్లడించాడు.

గంటలోనే టికెట్లు ఖతం
బ్రెజిల్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ఫుల్‌ డిమాండ్‌  
కోల్‌కతా:  భారత్, బ్రెజిల్‌ అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అక్టోబర్‌ 3న కోల్‌కతా వేదికగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ బ్రెజిల్‌తో భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్రాథమిక ధర టికెట్లన్నీ బుధవారం గంటలోనే అమ్ముడవడం విశేషం. ఫుట్‌బాల్‌ చరిత్రలో భారత జట్టు ఇప్పటి వరకు బ్రెజిల్‌తో మ్యాచ్‌ ఆడలేదు. దీంతో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆతృత కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల ధరలను రూ. 999 నుంచి రూ. 15,000గా నిర్ణయించారు. 

వివేకానంద యువ భారతి మైదాన సామర్థ్యం 67,000 కాగా... టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో రూ.999, రూ.2,000, రూ. 3,500, రూ. 4,500, రూ. 6,000, రూ. 7,000, రూ. 9,000, రూ. 15,000 టికెట్లు అమ్మకానికి ఉన్నాయిరు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి వచ్చిన గంట వ్యవధిలోనే ప్రాధమిక ధర టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు. 

ఈ నెల 26న బెంగళూరు వేదికగా పనామాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా... ఆ తర్వాత బ్రెజిల్, ఉరుగ్వే (అక్బోబర్‌ 6న) స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల కోసం భారత హెడ్‌ కోచ్‌ ఖాలిద్‌ జమీల్‌ ఇప్పటికే 26 మందితో కూడిన జట్టును ప్రకటించాడు. వీరంతా ఈ నెల 14 నుంచి బెంగళూరులో నిర్వహించనున్న జాతీయ శిబిరంలో పాల్గొననున్నారు. పనామాతో పోరు అనంతరం ఈ నెల 28న భారత జట్టు కోల్‌కతా చేరుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement