సముద్రంలో మునిగిన ‘పనామా’ కార్గో షిప్‌ | Panama cargo ship sinks at sea | Sakshi
Sakshi News home page

సముద్రంలో మునిగిన ‘పనామా’ కార్గో షిప్‌

Aug 24 2026 4:57 AM | Updated on Aug 24 2026 4:57 AM

Panama cargo ship sinks at sea

సముద్రంలో కనిపిస్తున్న లైఫ్‌రాఫ్ట్‌

సిబ్బందిని రక్షించేందుకు రంగంలోకి భారత నేవీ, కోస్ట్‌గార్డ్‌ 

విశాఖకు 700 కి.మీ. దూరంలో 24 మంది సిబ్బందితో ప్రమాదానికి గురైన షిప్‌ 

పీ8ఐ విమానంతో గాలింపు చర్యలుచేపట్టిన నౌకాదళం 

ఎంటీ ఏసోపోస్‌ షిప్‌ ద్వారా ఇద్దర్ని రక్షించిన నేవీ, కోస్ట్‌గార్డ్‌ 

మిగిలిన వారి కోసం కొనసాగుతున్న గాలింపు 

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో మునిగిపోయిన ఎంవీ ఓషన్‌ విన్నర్‌ కార్గో షిప్‌ సిబ్బందిని రక్షించేందుకు భారత నౌకాదళం, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. విశాఖపట్నానికి తూర్పున సుమారు 700 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పనామా దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ ఓషన్‌ విన్నర్‌ షిప్‌  ప్రమాదానికి గురైంది. దానినుంచి ఈ నెల 22 ఉదయం 11.48 గంటలకు అత్యవసర డిస్ట్రెస్‌ అలెర్ట్‌ అందింది. దీనిపై వెంటనే స్పందించిన భారత నౌకాదళం శ్రీవిజయపురంలోని మారిటైం రెస్క్యూ కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ సహకారంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. 

ఆ సమయంలో సముద్ర నిఘా విధుల్లో ఉన్న నౌకాదళానికి చెందిన ‘పీ8ఐ’ విమానాన్ని తక్షణమే గాలింపు, సహాయక చర్యల కోసం ప్రమాద స్థలానికి మళ్లించారు. గాలింపు చర్యల్లో భాగంగా నౌకాదళ విమానం ఆ ప్రాంతంలో ఉన్న లైఫ్‌రాఫ్ట్‌లను గుర్తించింది. వెంట­నే ఆ ప్రాంతానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఎంటీ ఏసోపోస్‌ నౌకతో సమన్వయం చేసుకొని సహాయం చేయాల్సిందిగా అలెర్ట్‌ పంపించింది. ఆ నౌక సత్వర స్పందనతో ఆదివారం సాయంత్రానికి 24 మంది సి­బ్బందిలో ఇద్దరిని లైఫ్‌రాఫ్ట్‌ల నుంచి రక్షించింది. గల్లంతైన నావికుల ఆచూకీ కోసం ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సంయుక్తంగా గాలిస్తున్నాయి.

పనామా ఫ్లాగ్‌తో పారాదీప్‌ నుంచి వస్తూ.. 
ఎంవీ ఓషన్‌ విన్నర్‌ కార్గో షిప్‌ ఈ నెల 20న పారాదీప్‌ పోర్టు నుంచి 72,100 మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజంతో రాత్రి 10.42 గంటలకు సింగపూర్‌ బయలుదేరింది. పనామా దేశపు జెండాతో వస్తున్న ఈ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 20 మంది చైనీయులు కాగా.. ముగ్గురు మయన్మార్, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు. మిగిలిన 22 మందిని రక్షించేందుకు ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కు చెందిన వరద్, అన్మోల్, విజిత్‌ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. నౌకలో సాంకేతిక లోపం తలెత్తిందా లేక మరేదైనా అత్యవసర పరిస్థితి ఎదురైందా అన్న కోణంలో అధికారులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement