టాటా పవర్ ఒడిశాకు, వెబ్‌సోల్ పశ్చిమబెంగాల్‌కు తరలిపోయాయి
‘మరో పవర్ కంపెనీ పరార్’ అనే సాక్షి కథనంపై ప్రభుత్వ స్పందన
ఇంతకుముందు వెళ్లిపోయిన ఐదు కంపెనీలు
ఇప్పుడు వెళ్లిన వాటితో కలిపి పరారయిన కంపెనీల సంఖ్య ఏడుకు చేరిన వైనం
రాష్ట్రంలో వీటి మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనల విలువ రూ.16,248 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి టాటా పవర్, వెబ్‌సోల్ సంస్థలు వెళ్లిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ’జీవోలు జారీ చేసిన తర్వాత కూడా’ రాష్ట్రం నుంచి మొత్తంగా ఏడు కంపెనీలు తమ రూ.16,248 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను వెనక్కు తీసుకున్నట్లయ్యింది. తిరుపతి జిల్లా నాయుడు పేట వద్ద రూ.3,538 కోట్లతో 4 గిగావాట్ల సోలార్ సెల్స్ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి వెబ్‌సోల్ ముందుకురాగా, రూ.6,675 కోట్లతో నెల్లూరు జిల్లా క్రిభ్‌కో వద్ద టాటాపవర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దీంతో ప్రభుత్వం భూమి, భారీ ప్రోత్సాహకాలను ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అయితే రెండు సోలార్ విద్యుత్ ఉపకరణాల తయారీ సంస్థలు తమ పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుని ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో ‘టాటా పవర్ బాటలో వెబ్‌సోల్.. రాష్ట్రం నుంచి మరో పవర్ కంపెనీ పరార్’ అంటూ ‘సాక్షి’ శుక్రవారం సంచికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పందించింది. టాటాపవర్ ఒడిశాకు, వెబ్‌సోల్ పశ్చిమబెంగాల్‌కు వెళ్లిపోయినట్లు వివిధ మాధ్యమాల ద్వారా తెలిసినట్లు వివరించింది. ఇందులో ముఖ్యాంశాలు..
» ఒడిశా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ విద్యుత్ సబ్సిడీ ఇవ్వడంతో టాటా స్పెషల్ ఎకనామిక్ జోన్లో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
» అలాగే నాయుడుపేట వద్ద వెబ్‌సోల్ యూనిట్ పెట్టడానికి వచ్చినా కంపెనీ అంతర్గత నిర్ణయంతో పశ్చిమబెంగాల్‌లోని ఫాల్తా వద్ద ఇప్పటికే ఉన్న యూనిట్ల వద్దనే మూడో దశ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని రాష్ట్రంలోని పెట్టుబడి ప్రతిపాదనల నుంచి వెనక్కు వెళ్లింది.
» ఇదే విధంగా జీవోలు ఇచ్చిన తర్వాత మరో అయిదు కంపెనీలు– జూపిటర్, హిందుస్థాన్ కోకాకోలా, అజాద్ ఇండియా, జిన్‌ఫ్రా, ఐస్పేస్‌లు రాష్ట్రంలో తమ పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా తెలియజేశాయి. దీంతో ఈ సంస్థలకు కేటాయించిన భూములను వేరే కంపెనీలకు కేటాయించాం.


