1.10 లక్షల చేరికలెక్కడ? 5.56 లక్షల మంది తగ్గడమే నిజం!
కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ గణాంకాలే తేల్చాయి
2023–24లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 40.50 లక్షలు
2025–26లో ఆ సంఖ్య 34.93 లక్షలకు పడిపోయింది
మూడేళ్లలో ప్రభుత్వ బడుల్లో ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు
ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222కు తగ్గింది
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కు పడిపోయాయి
ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45.53 లక్షల నుంచి 48.40 లక్షలకు పెరిగింది
ప్రైవేటు విద్యా సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధమే దీనికి కారణం.. ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి సర్కార్ బలహీనపరుస్తుండడం ఆందోళనకరం
విద్యారంగంలో మేం విప్లవాత్మక మార్పులు తెచ్చాం
నాడు–నేడుతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల విప్లవం
ఆంగ్ల మాధ్యమం, బైజూస్ ట్యాబ్స్, ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలు, టోఫెల్, ఐబీ అమలుచేశాం
చంద్రబాబు సర్కార్ తీరును ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24లో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 5.56 లక్షలు తగ్గిందని కేంద్ర విద్యా శాఖకు చెందిన యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్–యూడీఐఎస్‌ఈ) గణాంకాలు తేల్చిచెబుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోందంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందంటూ చంద్రబాబు సర్కార్‌కు చురకలంటించారు.
‘యూడైస్+’ గణాంకాలను ఉటంకిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో కూటమి సర్కార్ అనుసరిస్తున్న తీరును కడిగిపారేశారు. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయని, విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా.. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఎత్తిచూపారు. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామమంటూ ‘ఎక్స్’లో తన ఖాతాలో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఆ పోస్టులో ఏమన్నారంటే..
బాబు ప్రభుత్వ డొల్ల ప్రచారం.. ఈ లెక్కలే సాక్ష్యం..
‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది.

2023–24 విద్యా సంవత్సరంతో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో 5,56,666 మంది విద్యార్థులు తగ్గినట్లు వెల్లడిస్తున్న యూడైస్ ప్లస్ నివేదిక

2023–24 విద్యాసంవత్సరంతో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222కు, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 991 నుంచి 797కు తగ్గినట్లు వెల్లడిస్తున్న యూడైస్ ప్లస్ నివేదిక
» నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యూడైస్’ వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది.
» అలా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం.
ప్రైవేటు విద్యా సంస్థలతో టీడీపీకి ఉన్నఅపవిత్ర సంబంధం కారణంగానే..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది.
విద్యారంగంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు
» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు–నేడు కార్యక్రమం కోసం మా ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది.
» ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లిష్‌లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం చేసుకున్నాం.
» ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాకలారియేట్–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
» ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం.


