‘ద‌మ్ముంటే వారి ఫోన్ లోకేష‌న్లు బ‌య‌ట‌పెట్టాలి’ | TTD Former Chairman Bhumana Slams BR Naidu Over Tirumala Liquor And Gutka Case, Demands CCTV Footage And Phone Locations | Sakshi
Sakshi News home page

‘ద‌మ్ముంటే వారి ఫోన్ లోకేష‌న్లు బ‌య‌ట‌పెట్టాలి’

Aug 23 2026 6:58 PM | Updated on Aug 23 2026 7:06 PM

TTD Former Chairman Bhumana Slams BR Naidu
  • తిరుమల కొండ‌పై మద్యం దందాపై ప‌చ్చి అబద్ధాలు
  • అలిపిరిలో దొరికిన‌ట్టు త‌ప్పుడు కేసు
  • విజిలెన్స్‌, పోలీసులు, టీటీడీ చైర్మ‌న్ మూకుమ్మడి మోసం
  • టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ధ్వజం

తిరుప‌తి: తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ కొండపై జరుగుతున్న మద్యం, గుట్కా వ్యాపారాన్ని విజిలెన్స్, పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుప‌తిలోని త‌న క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలక మండలి అధ్యక్షుడు బీఆర్‌ నాయుడు తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. 

అలిపిరి లింక్ బస్‌స్టాండ్‌లో మద్యం బాటిళ్లతో ఇద్దరిని పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారని, అయితే వాస్తవానికి వారిని తిరుమల కొండపైనే వేర్వేరు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారని భూమన ఆరోపించారు. కౌస్తుభం గెస్ట్ హౌస్ సమీపంలో ఈగ రాము 182 క్వార్టర్ మద్యం బాటిళ్లను బాలాజీ అనే వ్యక్తికి సరఫరా చేస్తుండగా విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడని తెలిపారు. 

మరోవైపు ఈగ ప్రియ నాగతీర్థం సమీపంలో వేలాది గుట్కా ప్యాకెట్లతో పట్టుబడిందని పేర్కొన్నారు. ఎస్ఐ శ్రీవాణి ఫోన్ లొకేషన్‌తో పాటు ఈగ రాము ఫోన్ లొకేషన్‌ను కూడా బహిర్గతం చేయాలని భూమన సవాల్ చేశారు. సంబంధిత సమయాల్లో వారి ఫోన్ లొకేషన్లు బయటకు వస్తే అసలు వాస్తవాలు తేలిపోతాయని అన్నారు. బీఆర్‌ నాయుడుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒట్టి ప్రకటనలతో సరిపెట్టకుండా సీసీ కెమెరా ఫుటేజీలు, ఫోన్ లొకేషన్ వివరాలను బయటపెట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విజిలెన్స్, పోలీసు అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అసలు వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన కోరారు.

‘తిరుమల కొండపై మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిన‌ ఈగ రాము, ఈగ ప్రియ అరెస్టు వ్యవహారంలో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. వాస్తవానికి ఈ నెల 21వ తేదీ సాయంత్రం 7.30 నుంచి 8 గంటల ప్రాంతంలో తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఈగ రాము, బాలాజీ అనే మరో వ్యక్తికి 182 క్వార్టర్ మద్యం బాటిళ్లు సరఫరా చేస్తుండగా విజిలెన్స్ అధికారులకు దొరికారు. బాలాజీ అనే వ్య‌క్తి ఈగ రాము లాంటి వాళ్లను చాలామందిని పెట్టుకుని పెద్ద ఎత్తున మద్యం వ్యాపారం చేస్తున్నాడు. 

బాలాజీ లాంటి వాళ్లు ఇంకా చాలామంది కొండ మీద ఇలాంటి అక్రమ కార్యకలాపాలే చేస్తున్నారు. అదే సమయంలో ఈగ ప్రియ అనే మహిళ శిలాతోరణం దగ్గర ఉన్న నాగతీర్థం వద్ద వేలాది గుట్కా ప్యాకెట్లతో పట్టుబడింది. అంటే ఒకరు కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర, మరొకరు నాగతీర్థం దగ్గర కొండ మీద పట్టుబడ్డారు. వీరితో బాలాజీ మద్యం దందా చేయిస్తున్నాడు. కానీ వీళ్లిద్దరూ నిన్న ఉదయం 10 గంటల సమయంలో అలిపిరి లింక్ బస్ స్టాండ్‌లో మద్యంతో పట్టుబడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. అసలు కొండ మీద పట్టుబడిన వారిని లింక్ బస్ స్టాండ్‌లో పట్టుకున్నట్లు ఎలా చూపించారు? ఈ మార్పు ఎందుకు చేశారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’అని ప్రశ్నించారు.

చైర్మన్ ఆదేశాలతోనే కప్పివేత జరిగిందని ఆరోపణ
వీళ్లు పట్టుబడిన తర్వాత విజిలెన్స్ అధికారులు తమ పైఅధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆ విషయాన్ని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు బీఆర్‌ నాయుడుకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని, సంఘటన జరిగిన ప్రదేశం బయటకు రాకుండా చూడాలని ఉన్నతాధికారులకు చెప్పించారని నేను ఆరోపిస్తున్నాను. అందుకే నేను బీఆర్‌ నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసలు ఘటన ఎక్కడ జరిగిందో ప్రజలకు చెప్పండి. కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజీని బయటపెట్టండి. నాగతీర్థం దగ్గర సీసీ కెమెరా ఫుటేజీని బయటపెట్టండి. ఆ రోజు కొండపై విజిలెన్స్ అధికారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో తెలిపే సీసీ కెమెరా ఫుటేజీలను కూడా బయటపెట్టండి.

అలిపిరి లింక్ బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజ్‌లు బ‌య‌ట‌పెట్టాలి
అలిపిరి లింక్ బస్ స్టాండ్‌లో ఉదయం 10.30 గంటలకు వీళ్లను పట్టుకున్నారని చెబుతున్నారు. నిజంగానే అక్కడ పట్టుకుని ఉంటే ఆ సమయంలో లింక్ బస్ స్టాండ్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని బయటపెట్టండి. రెండు సంచుల్లో మద్యం బాటిళ్లు దొరికాయని చెబుతున్నారు కాబట్టి, ఆ దృశ్యాలు కూడా ప్రజలకు చూపించండి. అంతేకాదు, ఎస్ఐ శ్రీవాణి గారి ఫోన్ లొకేషన్‌ను బయటపెట్టాలి. ఈగ రాము ఫోన్ లొకేషన్‌ను కూడా బయటపెట్టాలి. 21వ తేదీ సాయంత్రం 7.30 నుంచి 8 గంటల మధ్య ఈగ రాము ఎక్కడ ఉన్నాడో ఫోన్ లొకేషన్ ద్వారా తేలిపోతుంది. అలాగే మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు శ్రీవాణి గారు ఎక్కడ ఉన్నారో కూడా ఫోన్ లొకేషన్ ద్వారా స్పష్టమవుతుంది.

ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల కులాల ప్రస్తావనా?
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎఫ్‌ఐఆర్‌లో ఈగ రామును వైశ్య కులస్తుడిగా, ఈగ ప్రియను మాదిగ కులస్తురాలిగా నమోదు చేశారు. ఈగ ప్రియ భర్త థామస్ అని కూడా పేర్కొన్నారు. కేసు నమోదుకు నిందితుల కుల వివరాలను ఇలా నమోదు చేయాల్సిన అవసరం ఏముంది? దీనిపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలి.

తిరుమలలో పెద్ద ఎత్తున మద్యం వ్యాపారం
తిరుమల కొండ మీద పెద్ద ఎత్తున మద్యం వ్యాపారం జరుగుతోంది. కింద రూ.120కు కొనుగోలు చేసే క్వార్టర్ బాటిల్‌ను కొండ మీద రూ.350 నుంచి రూ.500 వరకు అమ్ముతున్న పరిస్థితి ఉందని నేను చెబుతున్నాను. రోజుకు సరాసరి దాదాపు వెయ్యి క్వార్టర్ బాటిళ్లు కొండ మీదకు వెళ్తున్నాయని నా ఆరోపణ. ఇంత పెద్ద మొత్తంలో మద్యం కొండ మీదకు ఎలా వెళ్తోంది? ఎవరి సహకారంతో వెళ్తోంది? ఎవరు అమ్ముతున్నారు? ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? దీనిపై విజిలెన్స్, పోలీసు అధికారులు సమాధానం చెప్పాలి.

గతంలో కూడా తిరుమల కొండ మీద మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఆ సమయంలో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన వాస్తవాలను బయటపెట్టాలని మేము డిమాండ్ చేసినా స్పందించలేదు. ఇప్పుడు కూడా 182 మద్యం బాటిళ్లు, వేలాది గుట్కా ప్యాకెట్లు పట్టుబడిన వ్యవహారంలో అసలు ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది’అని ఆరోపించారు.

ద‌మ్ముంటే వారి ఫోన్ లోకేష‌న్లు బ‌య‌ట‌పెట్టాలి
బీఆర్‌ నాయుడుకి నిజంగా దమ్ము, చిత్తశుద్ధి ఉంటే ఒట్టి ప్రకటనలతో సరిపెట్టుకోవద్దు. కౌస్తుభం, నాగతీర్థం, అలిపిరి లింక్ బస్ స్టాండ్ ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజీలను బయటపెట్టండి. ఎస్ఐ శ్రీవాణి, ఈగ రాము ఫోన్ లొకేషన్లను బయటపెట్టండి. వీటన్నింటినీ బయటపెడితే అసలు ఘటన ఎక్కడ జరిగింది, ఎవరిని ఎక్కడ పట్టుకున్నారు, ఎఫ్‌ఐఆర్‌లో వాస్తవాలను ఎందుకు మార్చారు అనే విషయాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తాయి. ఒట్టి ప్రకటనలతో ఈ వ్యవహారాన్ని ముగించకుండా, సీసీ కెమెరా ఫుటేజీలు, ఫోన్ లొకేషన్లు, సంబంధిత రికార్డులన్నింటినీ ప్రజల ముందు ఉంచి మీ నిజాయితీని నిరూపించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే తిరుమల చరిత్రలో ఈ వ్యవహారం విజిలెన్స్, పోలీసు అధికారులపై, టీటీడీ పాలక మండలిపై ఒక తీరని మచ్చగా మిగిలిపోతుందని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు.

ఇదీ చదవండి:
‘అభివృద్ధి మాది.. డప్పు  కూటమి ప్రభుత్వానిది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement