తాడేపల్లి: రామోజీ రావు రాజకీయ నాయకుడు కాదు కానీ, టీడీపీని నడిపించిన వ్యక్తని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. రామోజీకి చెందిన మార్గదర్శికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని అన్నారు. మార్గదర్శి బకాయిలను ఆయన వారసులు చెల్లించాల్సిందేనని చెప్పారు. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారు.
రామోజీ ఆర్ధికనేరగాడని, ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేశాక రామోజీ కొన్ని టీవీ ఛానళ్లను అమ్మేశారని అంబటి రాంబాబు చెప్పారు. ఆ డబ్బును డిపాజిట్‌దారులకు అందించారని తెలిపారు. ఆర్‌బీఐని కూడా మేనేజ్ చేశారని, అందుకే మార్గదర్శి గురించి ఇక మేము పట్టించుకోమంటూ ఉండవల్లికి లేఖ రాసిందని చెప్పారు. ఉండవల్లి సొంతంగా కేసును వాదించారని అన్నారు. 20 ఏళ్లుగా ఆయన మార్గదర్శిపై పోరాటం చేస్తున్నారని తెలిపారు. మార్గదర్శి చిట్స్ కూడా తప్పుదారిలో నడుస్తోందని చెప్పారు.
రామోజీ బతికినంతకాలం చంద్రబాబుకు సేవ చేశారని అన్నారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారని చెప్పారు. ఎన్టీఆర్‌ను అవినీతి పరుడనీ చిత్రీకరించారని తెలిపారు. అందుకే ఆయన చనిపోయాక చంద్రబాబు ప్రభుత్వం సొంత ఖర్చుతో సంతాప సభలు పెట్టిందని చెప్పారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రశ్నించామని గ్రూప్ 1ని తెరమీదకు తెచ్చారని తెలిపారు. రెండింటిపై సీబీఐ విచారణ జరిపించాలంటే చంద్రబాబు, లోకేశ్ పారిపోయారని అన్నారు.
ఉద్యోగాలు రాక రోడ్డున పడిన వారితో ర్యాలీ చేయించగలరా? అని అంబటి రాంబాబు నిలదీశారు.
‘‘పరీక్ష పేపర్ లీక్ కాలేదనీ, అంతా సక్రమంగా జరిగిందని వారితో చెప్పించగలరా? పవన్ కల్యాణ్ కేబినెట్ మీటింగ్‌లకు ఎందుకు వెళ్లటంతో ఆయనే చెప్పాలి. అనారోగ్యంతో రావటంలేదని జనసేన వాళ్లు అంటున్నారు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ఆరోగ్యకర వాతావరణం దెబ్బ తిన్నదని కొందరు అంటున్నారు’’ అని అంబటి రాంబాబు తెలిపారు.


