సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ, గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సవాల్‌పై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు తన కుమారుని కాపాడుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ సమస్యలు మీద కాకుండా రాజకీయాలు మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన స్కాం నుంచి బయట పడటం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. డీఎస్సీ, గ్రూప్-1 అవకతకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ సవాల్‌పై నోరు మెదపలేదు.
తన కుమారుని కాపాడుకోవటం మీద చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.
ప్రజాధనంతో సభలు పెడుతూ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు. లోకేస్ తోడల్లుడు భరత్, ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేస్తే ఉద్యోగాలు ఇచ్చారు. మీ వారిని కాపాడుకోవడానికి తాపత్రయమా చంద్రబాబు?. పనిక కాక ముందు ఒక జీవో.. పని అయ్యాక ఒక జీవోనా? సీబీఐ విచారణ జరిపించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?.
ఒకొక్క టీచర్ ఉద్యోగాన్ని 15 లక్షలు వరకు అమ్ముకున్నారు. వైఎస్ జగన్ లక్ష 30 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేశారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎక్కడా ఒక అవినీతి ఆరోపణ వినిపించలేదు. అది వైఎస్ జగన్ క్రెడిబిలిటి. మీ పార్టీ నాయకులు సంతకాలు పెట్టిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం అని ప్రజలు నమ్ముతున్నారు. డేటా సెంటర్లకు మేము వ్యతిరేకం కాదు. డేటా సెంటర్లకు 10 టీఎంసీ నీళ్లు అవసరం. ఆ నీటిని డేటా సెంటర్లకు ఎలా ఇస్తారు?. చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలు. చంద్రబాబు పాదంతో మరోసారి కరువు సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం కోసమే బహిరంగ సభ పెట్టారు అంటూ మండిపడ్డారు.


