గర్భధారణకు ముందే అనారోగ్య సమస్యలు ఉంటే 20 శాతం అధికంగా గర్భస్రావాలు
22 లక్షల మంది గర్భిణుల ఆరోగ్యంపై బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం
దాదాపు 22 ఏళ్లపాటు గర్భధారణ కేసులపై పరిశోధన
సాక్షి, అమరావతి: ఆధునిక జీవన శైలి, ఆహార అలవాట్లతో ప్రస్తుతం ఊబకాయం, థైరాయిడ్, డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన ఇతర సమస్యలు పిల్లల నుంచి పెద్దల్లో సర్వసాధారణంగా మారాయి. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ రుగ్మతలు వారి ఆరోగ్యంపైనే కాకుండా మాతృత్వంపై దు్రష్పభావం చూపుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న గర్భిణులకు గర్భస్రావం(అబార్షన్) ముప్పు ఎక్కువేనని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి.
లండన్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన కింగ్స్ కాలేజ్‌లో చేపట్టిన అధ్యయనంలో ఒకటి కంటే ఎక్కువ దీర్ఘకాలిక శారీరక, మానసిక సమస్యలు ఉండే మహిళల్లో గర్భస్రావం జరిగే ముప్పు 20 శాతం ఎక్కువని గుర్తించారు. 2000 నుంచి 2022 మధ్య 22 లక్షలకుపైగా గర్భధారణ కేసులపై పరిశోధన నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన మహిళల ఆరోగ్య వివరాల సమగ్ర విశ్లేషణలో కీలక అంశాలు గుర్తించారు.
42 శాతం అధిక రక్తపోటు ముప్పు
ఏ అనారోగ్య సమస్యలూ లేని మహిళలతో పోలిస్తే ఒకటి కంటే ఎక్కువ రుగ్మతలు ఉన్న వారిలో గర్భస్రావానికి 20 శాతం అధిక ముప్పు ఉంటుందని పరిశోధకులు ప్రధానంగా తేల్చారు. అదేవిధంగా మాయ విడిపోవడం (ప్లాసెంటల్ అబ్రప్షన్)కు 32 శాతం, గర్భంలో అధిక రక్తపోటు (ప్రీ–ఎక్లాంప్సియా)కు 42 శాతం ఎక్కువ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం రెండు రెట్లకుపైగా ఉంటుందని గుర్తించారు. మానసిక ఒత్తిడి, ఆందోళన దాదాపు నాలుగు రెట్లు అధికం అవుతుందని తేల్చారు.
ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక సమస్యలున్న మహిళలకు సాధారణ పద్ధతిలో కాకుండా ‘హై–రిస్క్ ప్రెగ్నెన్సీ’గా పరిగణించి తొలి త్రైమాసికం నుంచే వైద్యుల ప్రత్యేక శ్రద్ధ అవసరమని పరిశోధనలో సూచించారు. గైనకాలజిస్ట్‌తోపాటు జనరల్ మెడిసిన్, ఎండోక్రైనాలజిస్ట్, మానసిక నిపుణులు... ఇలా గర్భిణి మహిళ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఏకీకృత చికిత్స అందించాల్సి అవసరం ఉంటుందని స్పష్టంచేశారు.
మూడు నెలల ముందే సమగ్ర పరీక్షలు
గర్భధారణలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సురక్షితంగా బిడ్డకు జన్మనివ్వాలంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
» పిల్లలు కావాలని నిర్ణయించుకున్న మహిళలు మూడు నెలల ముందే సమగ్ర ఆరోగ్య పరీక్షలు (బీపీ, షుగర్, థైరాయిడ్, ఇతర పరీక్షలు) చేయించుకోవాలి.
» బీపీ, షుగర్, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారైతే వాడుతున్న మందులు గర్భధారణలో బిడ్డకు హానికరం కాకుండా ఉండేందుకు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి.
» దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు పూర్తి సాధారణ స్థితికి ఆరోగ్యం చేరుకున్న తర్వాత గర్భం దాల్చడం సురక్షితం
» రోజూ పౌష్టికాహారం తీసుకోవడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, వాకింగ్ లేదా యోగా ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం తప్పనిసరి.
» ఊబకాయంతో బాధపడేవారు బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. తక్కువ బరువు ఉండే మహిళలూ బీఎంఐ విషయంలో జాగ్రత వహించాలి. అధిక బరువే కాకుండా, తక్కువ బరువు కూడా సమస్యలకు దారితీయవచ్చు.
రక్తహీనత విషయంలో అప్రమత్తంగా ఉండాలి
గర్భధారణకు ప్రణాళిక చేసుకునే మహిళలు రక్తహీనత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయి కనీసం 12శాతం ఉండేలా చూసుకోవాలి. ప్రత్యేకించి 8 శాతం కంటే తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి ఉంటే గర్భధారణ వాయిదా వేసుకోవడం ఉత్తమం. వైద్యులు సూచించిన చికిత్సలు పొంది, రక్తహీనత సమస్యను అదిగమించాకే గర్భధారణకు ప్లాన్ చేసుకోవాలి. రక్తహీనత సమస్య గర్భధారణ సమయంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. రాష్ట్రంలో నమోదవుతున్న మాతృ మరణాలకు ఈ సమస్యే ప్రధాన కారణంగా ఉంటోంది. – డాక్టర్ అనిల్‌కుమార్, రాష్ట్ర అదనపు డైరెక్టర్, మాతా, శిశు ఆరోగ్య సేవలు


