అల్లూరి గుహలపై టీడీపీ నేతల కన్ను | TDP leaders eye on Alluri caves for mining | Sakshi
Sakshi News home page

అల్లూరి గుహలపై టీడీపీ నేతల కన్ను

Aug 23 2026 5:46 AM | Updated on Aug 23 2026 5:47 AM

TDP leaders eye on Alluri caves for mining

అనకాపల్లి జిల్లా సరుగుడులో మైనింగ్‌ దూకుడు 

130.5 హెక్టార్లలో సాగుతున్న భారీ మైనింగ్‌ 

ఇక్కడే మరో 36 హెక్టార్లకు తాజాగా దరఖాస్తు 

అనుమతి లభిస్తే అల్లూరి గుహలకు ముప్పు 

చినబాబుతోపాటు ఇద్దరు ఎంపీలకు వాటాలు! 

ప్రతి టన్నుపై చినబాబుకు రూ.500, ఎంపీలకు చెరో రూ.250 చొప్పున వాటాల చెల్లింపులు 

ఇప్పటికే పంచదార్ల, రామకొండలను కరగదీస్తున్న కూటమి నేతలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో అటు డేటా సెంటర్ల పేరుతో సింహాచలం, పావురాల కొండలను.. ఇటు మైనింగ్‌ పేరుతో పంచదార్ల, నాగులకొండ, రామకొండలను కరిగించేస్తున్న టీడీపీ నేతల కన్ను ఇప్పుడు గుహలపై పడింది. అటు శివుడి క్షేత్రాన్ని, ఇటు రాముడు సేదతీరిన కొండను కరిగించేస్తున్న అధికార పార్టీ మైనింగ్‌ మాఫియా కన్ను ఇప్పుడు అల్లూరి గుహలపై పడింది. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో ఇప్పటికే 130.5 హెక్టార్ల పరిధిలోని రెండు ప్రాంతాల్లో మైనింగ్‌ జరుగుతుండగా.. తాజాగా మరో 36 హెక్టార్ల పరిధిలో మైనింగ్‌కు అనుమతి ఇచ్చేందుకు వేగంగా పావులు కదులుతున్నాయి. ఇక మూడో మైనింగ్‌కు కూడా అనుమతి వస్తే.. చరిత్రాత్మకంగా విలువైన అల్లూరి గుహలు సైతం కనుమరుగవుతాయనే ఆందోళన గిరిజనుల్లో వ్యక్తమవుతోంది.  

మన్యం పితూరి ప్రణాళిక రచించిన గుహలివి   
బ్రిటిష్‌ పాలకులపై పోరాటంలో భాగంగా ‘మన్యం పితూరి’ తిరుగుబాటుకు ప్రణాళిక రచించిన గుహలు.. రంపచోడవరం పోలీసు స్టేషన్‌పై దాడికి పక్కా ప్లానింగ్‌ వేసిన అల్లూరి గుహలు చరిత్రలో కనపడకుండా పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరుగుడు పంచాయతీ అసన్‌గిరి గ్రామ పరిధిలోని గంగాలమ్మ కొండలో భాగంగా ఉన్న ఈ అల్లూరి గుహల నుంచే 1922–24 ప్రాంతంలో మన్యం పితూరి తిరుగుబాటు కొనసాగింది. ఇక్కడే అల్లూరి గుహలుగా పిలవబడే 7 గుహలు ఉన్నాయి. ఈ అన్ని గుహలకు ఇప్పుడు మైనింగ్‌ ముప్పు పొంచి ఉంది. 

ఇప్పటికే ఇదే సరుగుడు పంచాయతీలోని నాగులకొండపై సాగుతున్న మైనింగ్‌ వల్ల 60 అడుగుల మేర తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా.. 100 అడుగుల లోతున తవ్వకాలు చేపడుతున్నారు. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లోని 10 గిరిజన గ్రామాలకు తాగునీటి ఇబ్బందులతో పాటు వంట చెరకు కోసం అగచాట్లు పడే అవకాశం నెలకొంది. ఇక్కడ సాగుతున్న మైనింగ్‌తో లభిస్తున్న హైగ్రేడ్‌ లేటరైట్‌ టన్ను ధర రూ.5 వేలు పలుకుతోందని సమాచారం. రోజుకు 20 వేల టన్నులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు రూ.10 కోట్ల మేర విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నట్టు సమాచారం. ఇక్కడి నుంచి తరలిస్తున్న ప్రతీ టన్నుకు చిన్నబాబు పేరుతో రూ.500 జమ చేస్తుండగా.. మరో ఇద్దరు ఎంపీల ఖాతాల్లోకి చెరో రూ.250 చొప్పున జమ అవుతోందనే ఆరోపణలున్నాయి.  

పేరు గిరిజనులది..  పెత్తనం చినబాబుది!    
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీలో ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో మైనింగ్‌ జరుగుతోంది. గిరిజనులైన జర్తా లక్ష్మణరావు పేరుతో 110 హెక్టార్లు, సర్వే నంబర్‌–532లో మరో 20.5 హెక్టార్లలో మైనింగ్‌ జరుగుతోంది. ఇక్కడి నుంచి సుమారు 18 లక్షల టన్నుల లేటరైట్‌ను తరలించగా.. మరో 20 లక్షల టన్నులను తరలించేందుకు ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇవికాకుండా ఇప్పుడు తాజాగా మరో 36 హెక్టార్లల్లో ఇదే సరుగుడు పంచాయతీ పరిధిలో సింగం భవానీ పేరుతో మైనింగ్‌ లీజుకు దరఖాస్తు చేసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య ఇదే ప్రాంతంలో మైనింగ్‌ కోసం టీడీపీ నేతలు చర్యలకు ఉపక్రమించారు. 

గిరిజనుల నుంచి వచ్చిన ఆందోళనతో వెనక్కితగ్గారు. అయితే, ఈ దఫా మాత్రం కచ్చితంగా ముందుకెళ్లేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇది గిరిజన ప్రాంతం కావడంతో 1/70 చట్టం అమలులో ఉంది. తద్వారా కేవలం గిరిజనులకు మాత్రమే మైనింగ్‌ చేసుకునేందుకు అనుమతులు వస్తాయి. అందువల్ల గిరిజనులను ముందుపెట్టి కూటమి నేతలు భారీగా మైనింగ్‌ను చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో చినబాబు పేరుతో స్థానికంగా ఉన్న కీలకనేత కుమారుడే పెత్తనమంతా చెలాయిస్తున్నారు.

వారు చెప్పిందే లెక్క!   
ఇప్పటికే మొత్తం సరుగుడు పంచాయతీ పరిధిలో 130.5 హెక్టార్లల్లో సాగుతున్న మైనింగ్‌ ద్వారా వచ్చే హైగ్రేడ్‌ లేటరైట్‌ను తరలించేందుకు అటవీ ప్రాంతంలో భారీ రహదారి నిర్మించారు. ఎక్కడా అటవీ శాఖ అనుమతులు లేవు. అయినప్పటికీ ఇష్టారాజ్యంగా అటవీ మార్గంలోని ఈ రహదారి మీదుగా కాకినాడ జిల్లాలోని రౌతులపూడిలోకి ఖనిజం తరలిపోతోంది. పర్మిట్లను మొత్తం కాకినాడ జిల్లా నుంచే మంజూరు చేస్తున్నారు. వాస్తవానికి మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతంలో వేబ్రిడ్జి ఉండాలి. 

తద్వారా ఆయా వాహనాల అనుమతి లోడు మేరకే ఖనిజం రవాణా అవుతోందా.. అధికంగా తరలిపోతుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న మైనింగ్‌ వ్యవహారంలో అటు చినబాబుతోపాటు ఇటు ఇద్దరు ఎంపీల పాత్ర ఉందని తెలియడంతో ఎక్కడా ఎటువంటి పర్మిట్లు అడగటం లేదు. వారు ఎంత తరలించారని చెబితే అదే అంకెలను మైనింగ్‌ అధికారులు కూడా నమోదు చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. భారీగా అక్రమ మైనింగ్‌ చేపడుతూ.. కేవలం నిబంధనల మేరకు మాత్రమే తరలిస్తున్నట్టు లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  

పేరుకే లేటరైట్‌.. విలువలో బాక్సైట్‌!   
వాస్తవానికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో లేటరైట్‌ లభిస్తుంది. అయితే, ఇక్కడ లభించే లేటరైట్‌ ఎంతో నాణ్యమైనది. రికార్డుల్లో మాత్రం తక్కువ నాణ్యత కలిగిన లేటరైట్‌ అని చెబుతూ అనుమతులు తీసుకుంటున్నారు. ఇక్కడ తవ్వితీస్తున్న లేటరైట్‌లో అల్యూమినియం 38–40 శాతంలోపు మాత్రమే ఉందని నివేదికల్లో పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వానికి తక్కువ రాయల్టీ చెల్లిస్తున్నారనే విమర్శలున్నాయి. 

వాస్తవానికి సరుగుడు వద్ద కూటమి నేతలు చేస్తున్న మైనింగ్‌ ప్రాంతంలో తవ్వుతున్న లేటరైట్‌లో ఏకంగా 45 శాతం మేర అల్యూమినియం ఉందని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ లభించే లేటరైట్‌ విలువ బాక్సైట్‌ ధరకు దగ్గరలో పలుకుతుంది. అందుకే కూటమి నేతలు రోజుకు వేల టన్నుల్లో తవ్వితీస్తున్న లేటరైట్‌ను సిమెంట్‌ కంపెనీలకు కాకుండా స్టీల్‌ ప్లాంట్లకు తరలిస్తున్నారు. ఒడిశాలోని వేదాంత ప్లాంట్‌కు సైతం ఇక్కడి నుంచే లేటరైట్‌ తరలిస్తున్నట్టు సమాచారం.    

చరిత్రనూ చెరిపేస్తున్నారు! 
గిరిజన ప్రాంతమైన సరుగుడు వద్ద ఇప్పటికే రెండు ప్రాంతాల్లో మైనింగ్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు 60 అడుగులకు మించకుండా తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా.. ఏకంగా 100 అడుగుల మేర తవ్వకాలు చేపడుతున్నారు. ఫలితంగా నాగులకొండ రోజురోజుకీ కుచించుకుపోతోంది. ఫలితంగా కొండకింద ఉన్న గిరిజన గ్రామాలకు భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి ఇబ్బందులు తప్పవనే ఆందోళన నెలకొంది. అంతేకాకుండా గిరిజనులు ప్రధానంగా ఇక్కడ వంట చెరకుపైనే ఆధారపడుతున్నారు. 

ఇక్కడ సాగుతున్న భారీ మైనింగ్‌ వల్ల ఈ ప్రాంతంలోని చెట్లన్నీ నరికేస్తున్నారు. వాగులు, గెడ్డలూ మాయమవుతున్నాయి. దీంతో సమీపంలోని 10 గిరిజన గ్రామాలకు తాగునీటికి నీరు ఇక్కట్లతో పాటు పొయ్యిలోకి పుల్ల కూడా దొరకదనే ఆందోళన నెలకొంది. ఓవైపు గిరిజనుల బతుకు మీద మైనింగ్‌ పడగ పడుతుండగా.. తాజాగా చేసుకున్న దరఖాస్తుతో ఏకంగా గిరిజన వీరుడు అల్లూరి సీతారామరాజు గుర్తులూ చెరిగిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.  

ఇక సుద్దకొండ.. గుటకాయ స్వాహా!
» అనకాపల్లి జిల్లా గంగవరం పరిధిలో కొండకు గుండు 
» సర్వే నెంబర్‌ 157లోని 20 ఎకరాల కొండను కొల్లగొడుతున్న వైనం 
» కూటమి నేత కనుసన్నల్లోనే భారీ దందా.. చోద్యం చూస్తున్న అధికారగణం 
» రోజూ వందలాది ట్రాక్టర్లలో సుద్ద, గ్రావెల్‌ తరలింపు 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మైనింగ్‌ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రకృతి ప్రసాదించిన పచ్చని కొండలను అధికార పార్టీ నాయకులు తమ ధన దాహానికి బలి చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరం పరిధిలో ఉన్న ‘సుద్దకొండ’ను చెరబట్టారు. ఈ వ్యవహారం వెనుక ఓ కూటమి నేత హస్తం ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 

నిబంధనల ప్రకారం సుద్దకొండ ప్రాంతంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదని తెలిసినా.. అధికారం అండదండలతో యథేచ్ఛగా తవ్వకాలకు తెరలేపారు. రాత్రి, పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ.. పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నారు. కొండకు ఒకవైపు గ్రావెల్‌.. మరోవైపు సుద్దకొండ మట్టిని ఇష్టానుసారంగా తవ్వేస్తూ.. ట్రాక్టర్ల ద్వారా దర్జాగా తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్న వైనంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గం గంగవరం పంచాయతీ పరిధిలోని బెన్నవోలు సర్వే నెంబర్‌ 157లో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సుద్దకొండ ఉంది. 

వ్యవసాయంతో పచ్చని పొలాల మధ్య పెద్దేరు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ బెన్నవోలు గ్రామం ఇప్పుడు కొండమట్టి, బుగ్గిలో కాలుష్యం కోరల్లో మగ్గిపోతోంది. ఈ గ్రామంలో పలు కుటుంబాలు సుద్దకొండలో బండను చేత్తో తవ్వుకొని దానిని ముగ్గు పిండిగా తయారు చేసి గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా వారికి ఇదే జీవనాధారం. ఇప్పుడు ఈ సుద్దకొండను గ్రానైట్‌ మాఫియా యంత్రాలతో తవ్వకాలు ప్రారంభించేయడంతో వారి ఉపాధికి సైతం గండిపడింది.

అడ్డగోలుగా అనుమతులు
బెన్నవోలు సుద్దకొండలో ప్రస్తుతం 17 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు లక్ష్మీనరసింహ మెటల్స్, శాండ్‌ ఇండస్ట్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే గ్రానైట్‌ సంస్థకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా అంతకు మించి తవ్వకాలు జరుపుతూ వందల ట్రాక్టర్లలో గ్రావెల్‌ని తరలించేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎక్స్‌వేటర్లతో కొండను పిండి చేస్తున్నారు. ఫలితంగా పచ్చని చెట్లతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు యంత్రాల మోతతో, దుమ్ము ధూళితో నిండిపోయింది. కాగా, ఈ దందా బయటకు పొక్కకుండా సదరు నేత పక్కా స్కెచ్‌ వేశారు. 

రవాణాకు భారీ టిప్పర్లని ఉపయోగించకుండా.. కేవలం ట్రాక్టర్లను మాత్రమే వాడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.2,000 చొప్పున వసూలు చేస్తూ రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లతో గుట్టుచప్పుడు కాకుండా ప్రకృతి సంపదను తరలించేస్తున్నారు. కళ్లెదుటే సుద్దకొండ మాయం అవుతున్నా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

మరోవైపు పైన తవ్విన గ్రావెల్‌ మట్టిని ఊరికి ఆనుకొని ఉన్న అదే కొండ భాగాన వేస్తున్నారు. తద్వారా ఆ మట్టి భారీ వర్షాలకు కొట్టుకు వచ్చి ఊరిలో, సమీపంలోని పొలాల్లో తిష్ట వేసే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలోనూ స్పష్టం చేశారు. అయినా తవ్వకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడం విస్మయం కలిగిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement