ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ గుబులు | Special TET Sparks Fresh Tension Among AP Government Teachers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ గుబులు

Oct 7 2026 5:46 AM | Updated on Oct 7 2026 5:46 AM

Special TET Sparks Fresh Tension Among AP Government Teachers

నిబంధనలు మార్చకుండా స్పెషల్‌ టెట్‌  

ముగిసిన జనరల్‌ టెట్‌కు 74,711 మంది టీచర్లు హాజరు  

50.93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటన  

జనరల్‌ కేటగిరీలో 89.9 శాతంతో అత్యధిక మంది ఫెయిల్‌  

నిబంధనలు మార్చకుండా స్పెషల్‌ టెట్‌తో ఫలితం లేదంటున్న ఉపాధ్యాయులు 

ఉత్తీర్ణత మార్కుల శాతం అందరికీ సమానంగా ఇవ్వాలని డిమాండ్‌  

టీచర్ల విన్నపాలను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం 

ఈ నెల 11 నుంచి టెట్‌ పరీక్షలు..  

ఇందులో ఫెయిలైతే ఇక వీఆర్‌ఎస్సేనని ఆందోళన

కర్నూలుకు చెందిన ఓ ఉపాధ్యాయురాలికి మ్యాథమెటిక్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా 20 ఏళ్ల సర్వీసు ఉంది. ఇటీవల ప్రభుత్వం ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు కూడా అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి చేయడంతో ఆగస్టులో నిర్వహించిన టెట్‌లో ఆమెకు 90 మార్కులకు గాను 89.97 మార్కులు వచ్చాయి. ప్రభుత్వం జనరల్‌ కేటగిరీ వారికి 90 శాతం మార్కులు తప్పనిసరి చేయడంతో 0.3 మార్కుల తేడాతో ఆమె పరీక్ష తప్పారు. ఇదే జిల్లాకు చెందిన మరో బీసీ వర్గానికి చెందిన మ్యాథ్స్‌ ఉపాధ్యాయుడికి 75 మార్కులకు గాను 74.91 మార్కులతో టెట్‌ తప్పారు. వీరిద్దరే కాదు.. ఆగస్టులో టెట్‌ రాసి ఫెయిలైన ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల్లో అత్యధిక మంది అతిస్వల్ప మార్కుల తేడాతో ఫెయిలయ్యారు.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్థ విధానాలపట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. టెట్‌ (టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌) రద్దుచేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కావాలనే తమను వేధిస్తోందని వాపోతున్నారు. గతేడాది అక్టోబర్‌ 28న ‘ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఇన్‌ సర్వీస్‌ టెట్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తాం. రద్దుకు కృషిచేస్తామని హామీ ఇస్తున్నాను’ అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించి తర్వాత ముఖం చాటేశారు.

బాధితులకు న్యాయం చేయకపోగా, టెట్‌– జూన్‌ పరీక్షకు జనరల్‌ అభ్యర్థులతో పాటు ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు జారీచేశారు. దీంతో అప్పటివరకు టెట్‌ రద్దుచేస్తారని ఆశించిన ఉపాధ్యాయులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేయడంతో ‘స్పెషల్‌ టెట్‌’ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.  

‘స్పెషల్‌ టెట్‌’ పేరుతో ఏమార్చి..  
అయితే, ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల విషయంలో అర్హత మార్కులు కేటగిరీ వారిగా కాకుండా అందరికీ సమానంగా ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదు. ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు ప్రామాణికంగా నిర్ణయించారు. దీంతో 89 మార్కులు పొందిన జనరల్‌ ఇన్‌ సర్వీసు టీచర్‌ను పోస్టుకు అనర్హులుగా తేల్చారు. అయితే, చాలామంది 60 మార్కులు పొందినందున అన్ని కేటగిరీల వారికీ సమానంగా 60 మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలని టీచర్లు కోరుతున్నారు.

మరోవైపు.. సిలబస్‌ వ్యవహారంలో గణిత ఉపాధ్యాయులకు సంబంధంలేని కేటగిరీల సిలబస్‌ కచ్చితం చేయడంతో వారు ఫెయిలయ్యారు. కేవలం 20 మార్కులకు మాత్రమే ఈ విభాగం ప్రశ్నలు ఇచ్చారు. వీటన్నింటినీ సరిచేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేయగా, ‘స్పెషల్‌ టెట్‌’ ద్వారా ఉపశమనం కలిగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, రెగ్యులర్‌ టెట్‌ మార్గదర్శకాలనే యథాతథంగా కొనసాగిస్తూ ఆగస్టు 24న స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఉపాధ్యాయులు పూర్తిచేసిన సర్వీసు కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. 55 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయుల కంప్యూటర్‌ పరిజ్ఞానంపై చర్చ జరుగుతున్నప్పటికీ 
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ రాయాలంటూ ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం.  

అందరికీ సమాన మార్కుల డిమాండ్‌.. 
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా నిబంధనలు మార్చాలి. కానీ, పాత నోటిఫికేషన్‌లో ఉన్న నిబంధనలతోనే కేవలం ‘స్పెషల్‌ టెట్‌’ పేరుతో ఇన్‌ సర్వీస్‌ టీచర్ల కోసం ఆగస్టులో నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాస్తవానికి.. టెట్‌–జూన్‌ నోటిఫికేషన్‌కు 74,711 మంది ఇన్‌ సర్వీస్‌ టీచర్లు దరఖాస్తు చేసుకోగా, 37,789 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. అయితే, అత్యధికులు ‘అర’ మార్కు కంటే తక్కువతో ఫెయిలయ్యారు. 89.9 మార్కులు పొందిన జనరల్‌ విభాగం టీచర్లు, 74.5 మార్కులు పొందిన బీసీ టీచర్లు ఉత్తీర్ణత కాలేదు. ఈ విధానంలో జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని, 0.5 మార్కులతో ఫెయిలైన వారిని పాస్‌ చేయాలని కోరినా రాష్ట్ర విద్యాశాఖ పట్టించుకోలేదు.  

డిమాండ్లు బేఖాతరు.. 
ఇక ఆగస్టులో విడుదలైన జూన్‌ టెట్‌ ఫలితాల్లో పేపర్‌–1ఏలో ఓసీలు 34.52 శాతం, బీసీలు 61.48 శాతం, ఎస్సీలు 74.29 శాతం, ఎస్టీలు 55.28 శాతం ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌–2ఏలో గణితం, సైన్స్‌ విభాగంలో ఓసీలు 10.94 శాతం, బీసీలు 29.8 శాతం, ఎస్సీలు 58.65 శాతం, ఎస్టీలు 47.33 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇతర విభాగాల్లో కూడా ఇదే పరిస్థితి.

విద్యా హక్కు చట్టం 23 (1) నిబంధన మార్పునకు పార్లమెంట్‌ చట్టం చేయాలని.. ఇందుకు తమిళనాడు తరహాలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న డిమాండ్‌ను సైతం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం అందరికీ అర్హత మార్కులు 60గా మార్చాలని, ఐఈడీ కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్‌ డీఎస్సీలో ఇచ్చిన మాదిరిగా సర్వీస్‌ కాలానికి వెయిటేజ్‌ మార్కులు ఇవ్వాలని, బోధిస్తున్న సబ్జెక్టులోనే టెట్‌ సిలబస్‌ ఉండాలన్న డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో ఈ నెల 
11 నుంచి జరిగే స్పెషల్‌ టెట్‌లో ఫెయిలైతే వీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సిందేనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement