నేతన్న సేవలో.. అవినీతిపై 'ఆగ్రహం' | Handloom workers protest on Dharmavaram Anantapur main road | Sakshi
Sakshi News home page

నేతన్న సేవలో.. అవినీతిపై 'ఆగ్రహం'

Aug 23 2026 5:39 AM | Updated on Aug 23 2026 5:39 AM

Handloom workers protest on Dharmavaram Anantapur main road

ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై చేనేత కార్మికుల రాస్తారోకో 

అధికార పార్టీ నేతలు, దళారులు కుమ్మక్కయ్యారు 

అర్హులైన చేనేత కార్మికులకు సాయం అందించాలని డిమాండ్‌ 

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేత కార్మికులు 

ధర్మవరం:  ‘నేతన్న సేవలో’ పథకంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని చేనేత కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు, అధికారులు, దళారులు కుమ్మక్కై అర్హులకు పైసా ఇవ్వకుండా, అనర్హులకు ఇచ్చారని ధ్వజమెత్తారు. వెంటనే అర్హులైన కార్మికులకు పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎన్డీఏ కార్యాలయం ఎదుట ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. 

చంద్రబాబు, కూటమి నాయకులు, దళారుల ఒత్తిడికి తలొగ్గి సచివాలయ, హ్యాండ్‌లూమ్స్‌ విభాగం అధికారులు పథకం నిధులను అనర్హులకు కట్టబెట్టారని తెలిపారు. అర్హులైన వేలాది నేత కార్మికులకు సాయం అందకుండా పోయిందన్నారు. చేనేత వృత్తికి ఎటువటి సంబంధం లేని వారికి సాయం అందించారని మండిపడ్డారు. అధిక శాతం నేత కార్మికులున్న పట్టణంలోని 4వ వార్డులో ఒక్కరికి కూడా సాయం అందకపోవడం అక్రమాలకు నిదర్శనమన్నారు. 

రెండో విడతలో ఇస్తామని అధికారులు చెబుతున్నారని, ఇంతవరకు ఆ జాబితా కూడా విడుదల చేయకపోవడం అనుమానాలను కలిగిస్తోందన్నారు. అదే సమయంలో స్థానిక మార్కెట్‌యార్డు వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ను చేనేత కార్మికులు కలిసి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పథకం అందడంలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అర్హుల జాబితా కూడా సచివాలయాల్లో ఇవ్వడంలేదన్నారు. అనర్హులకు సొమ్ములు కట్టబెట్టారని, ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. 

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ స్పందిస్తూ అర్హులైన చేనేత కార్మికులకు న్యాయం చేస్తామని, అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో చేనేత కార్మికులు నిరసన విరమించారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేనేత నాయకులు ఆదినారాయణ, శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement