ప్రభుత్వ బడులు ఖాళీ.. 5.56 లక్షల మంది విద్యార్థులెక్కడ?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Comments Over Govt Schools In AP, Raises Alarm Over Declining Government School Enrolment, Check His Post Inside | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడులు ఖాళీ.. 5.56 లక్షల మంది విద్యార్థులెక్కడ?: వైఎస్‌ జగన్‌

Aug 23 2026 1:14 PM | Updated on Aug 23 2026 3:38 PM

YS Jagan key Comments Over Govt Schools In AP

సాక్షి, తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. ‘UDISE+’ గణాంకాలు తేల్చి చెబుతున్న వాస్తవాలని వైఎస్‌ జగన్‌ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి అని వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారని అన్నారు.  

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా.. ‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతోనే దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది’.

‘నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యుడైస్‌’( యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ – యూడీఐఎస్‌ఈ) వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది’.

‘అలా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం’.

‘ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది’.

‘2019–24 మధ్య గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్‌ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్‌ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్‌ నాటికి కొనసాగుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమం కోసం మన ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది’.

‘ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్‌ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్‌ సర్టిఫికేషన్‌ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో ఒప్పందం చేసుకున్నాం’.

ఇది కూడా చదవండి: అల్లూరి గుహలపై టీడీపీ నేతల కన్ను.. 

‘ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం’ అని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement