CJP అభిజిత్‌ దీప్కేకు షాక్‌.. ప్రభుత్వ పాఠశాలల్లోకి నో ఎంట్రీ? | CJP Convener Abhijeet Dipke Faces FIR Over Alleged Unauthorized Visit To Government School In Latur, Check More Details | Sakshi
Sakshi News home page

CJP అభిజిత్‌ దీప్కేకు షాక్‌.. ప్రభుత్వ పాఠశాలల్లోకి నో ఎంట్రీ?

Aug 23 2026 10:38 AM | Updated on Aug 23 2026 11:57 AM

FIR against Abhijeet Dipke for entering Maharashtra govt school

న్యూఢిల్లీ: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కన్వీనర్ అభిజీత్ దీప్కేపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు రావడంతో, అభిజీత్ దీప్కేతో పాటు పార్టీ కార్యకర్త అజింక్య షిండే, ఇతర సీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదే విధంగా అనుమతి లేకుండా పాఠశాలలను సందర్శించడాన్ని నిషేధం విధించింది. 

లాతూర్ జిల్లాలోని ఔసా సమీపంలో ఉన్న జవాలిలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో, అధికారిక విధులకు ఆటంకం కలిగించారని, ఉపాధ్యాయులను బెదిరించారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సయ్యద్ షంషాద్‌బానో ఖైరతాలీఫిర్యాదుతో అభిజీత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

దీప్కేపై ఆరోపణలు  
దీప్కే, ఇతరులపై ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, దాడి చేయడం, బలప్రయోగం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, దీప్కే, అతని సహచరులు అధికారుల అనుమతి లేకుండా పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించారని ఆరోపణలు ఉన్నాయి. వారు విద్యార్థులతో కలిసి కూర్చుని పాఠశాల పరిస్థితులపై ప్రశ్నలు వేసినట్లు సమాచారం. వారు విద్యా, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీజేపీ నాయకుడు తమ పర్యటన, విద్యార్థులతో సంభాషణకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కూడా ఫిర్యాదులో వెల్లడించారు. దీప్కే తన పర్యటన సందర్భంగా మరో పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చి తరగతి గదులలో కూర్చోబెట్టారని, తద్వారా జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా, ఉపాధ్యాయులను సస్పెండ్ చేయిస్తానని ఆయన బెదిరించినట్లు కూడా పేర్కొన్నారు.

👉ఇదీ చదవండి: సీజేపీ ఎఫెక్ట్‌.. సంచలన విషయాలు వెలుగులోకి!

‘స్కూల్ థీక్ కరో’ ప్రచారం
దేశ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న ప్రారంభించిన తమ 'స్కూల్ థీక్ కరో' ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సౌకర్యాలలో సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా ఉన్న ఈ కార్యక్రమం, దీప్కే స్వగ్రామమైన హింగోలిలో ప్రారంభమైంది. అప్పటి నుండి సీజేపీ సభ్యులు వివిధ రాష్ట్రాల్లోని అనేక పాఠశాలలను సందర్శించారు, అయితే కొన్ని చోట్ల వీరు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. 

శుక్రవారం జైపూర్‌లోని రాంపురా కన్వర్‌పురాలో ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తున్నప్పుడు సీజేపీ బృందంపై దాడి చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, ముంబైలో విద్యా శాఖ సీజేపీ వాలంటీర్లను అనుమతి లేకుండా మున్సిపల్ పాఠశాలల్లోకి ప్రవేశించకుండా నిషేధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement