‘బాబు సర్కార్‌ దాష్టీకాలపై 'ఆంధ్రకేసరి' స్ఫూర్తితో పోరాడుతాం’ | Prakasam Pantulu Jayanti Celebrated At Ysrcp Central Office | Sakshi
Sakshi News home page

‘బాబు సర్కార్‌ దాష్టీకాలపై 'ఆంధ్రకేసరి' స్ఫూర్తితో పోరాడుతాం’

Aug 23 2026 3:42 PM | Updated on Aug 23 2026 3:47 PM

Prakasam Pantulu Jayanti Celebrated At Ysrcp Central Office

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో నడుస్తున్న పోలీస్ రాజ్యానికి, ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి ఆంధ్రకేసరి స్ఫూర్తితో పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఉద్ఘాటించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుకలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ బ్రిటీష్ సామ్రాజ్యంపై రాజీలేని పోరాటం చేసిన ధీరోదాత్తుడు టంగుటూరి అని కొనియాడారు.

ప్ర‌కాశం జిల్లాలో జన్మించి, లండన్‌లో బారిస్టర్ చదివిన ఆయన.. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అని కీర్తించారు. రాజమండ్రి మున్సిపల్ చైర్మన్‌గా, మద్రాస్ ప్రెసిడెన్సీలో రెవెన్యూ మంత్రిగా రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. 'స్వరాజ్యం' పత్రిక ద్వారా జాతీయోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు.

ప్రజల పక్షాన నిలబడతాం..
వైఎస్ జ‌గ‌న్ గారి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రకాశం పంతులు గారి బాటలోనే పయనిస్తోందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న పోలీస్ రాజ్యానికి, ప్రభుత్వ దాష్టీకాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని ఉద్ఘాటించారు. ఆంధ్రకేసరి స్ఫూర్తితో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణ‌మూర్తి, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయ‌కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement