ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్
భూ దోపిడీపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా గళం వినిపిస్తా
సర్కారు తీరుపై రైతులంతా సంఘటితంగా పోరాడండి.. న్యాయ సహాయం అందిస్తాం
మీ పోరాటానికి మద్దతుగా నిలుస్తాం
ల్యాండ్ పూలింగ్ పేరిట చంద్రబాబు సర్కారు ఒత్తిళ్లను వివరించిన రైతులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట దేశంలోనే అతిపెద్ద భూ దోపిడీ జరుగుతోందని ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. రాజధాని పేరుతో మూడు పంటలు పండే పొలాలు లాక్కోవడం సమంజసం కాదన్నారు. అమరావతిలో భూ దోపిడీపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా గళం వినిపిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రొఫెసర్ రామచంద్రయ్య, సామాజికవేత్త డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్‌లో యోగేంద్ర యాదవ్‌ను కలిసి రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీని వివరించారు.
ఈ సందర్భంగా రైతులు శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్, సంజీవరెడ్డి తదితరులు మాట్లాడుతూ భూములు ఇవ్వలేదనే అక్కసుతో ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందన్నారు. పొలాల చుట్టూ భారీ గుంతలు తవ్వడంతో పాటు వరద నీటిని విడిచి పెడుతున్నట్లు తెలిపారు. తమ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు..? ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? అని ఆరా తీస్తూ ఒత్తిడి తెస్తోందని వాపోయారు. మూడు పంటలు పండే తమ భూములు తమకు కావాలని స్పష్టం చేశారు. డబ్బు కన్నా... కూడు అవసరమని.. తమ భూములు తమకు వదిలేయాలని కోరుతున్నా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు.
రాజధాని ప్రకటించిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు కూడా ఇవ్వడం లేదని, ఇల్లు కట్టుకోవాలన్నా అవస్థలు పడుతున్నామన్నారు. గతంలో భూములు సేకరించిన రైతులకు 12 ఏళ్లుగా ప్లాట్లు అప్పగించలేదన్నారు. 29 గ్రామాల పరిధిలో చెరువులు, కుంటలు 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ప్రభుత్వం మాత్రం 800 ఎకరాలే అని ప్రకటిస్తోందని చెప్పారు. రైతులకు బఫర్‌జోన్, వాటర్ బాడీస్‌లో ఇస్తున్నారని వాపోయారు. భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఉచిత వైద్యం, పిల్లలకు ఉచిత విద్య అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని చెప్పారు.
సంఘటితంగా పోరాడండి
రైతుల కష్టాలు సావధానంగా విన్న ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ భూ యజమానుల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. హైదరాబాద్ విస్తీర్ణంతో సమానంగా భూములు సేకరించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. పరిశ్రమలు, ఆర్థిక కార్యకలాపాలు లేకుండా, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రైతులంతా సంఘటితంగా పోరాటం చేయాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఎలాంటి న్యాయం సహాయం కావాలన్నా.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలన్నా సహాయం అందిస్తామని యోగేంద్రయాదవ్ ప్రకటించారు.


