నేడు రైతులతో కలిసి పోతిరెడ్డిపాడు వద్ద భారీ ఎత్తున ఆందోళన
ఇప్పటివరకు శ్రీశైలంలోకి 203.67 టీఎంసీల ప్రవాహం
అందులో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ఏడెనిమిది టీఎంసీలే సరఫరా
శ్రీశైలంలో 876 అడుగుల్లో నీళ్లున్నప్పటికీ పోతిరెడ్డిపాడుకు 8 వేల క్యూసెక్కులే సరఫరా
హంద్రీ–నీవాకు మూడువేల క్యూసెక్కులు ఎత్తిపోత
విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు నాలుగు టీఎంసీలు తెలంగాణ తరలిస్తుండటంతో ‘శ్రీశైలం’ ఖాళీ
కరువుతో సీమ తల్లడిల్లుతున్నా పోతిరెడ్డిపాడుకు పూర్తిసామర్థ్యం మేరకు నీటిని సరఫరా చేయక పోవడంపై రైతులు ఆగ్రహం
శ్రీశైలం ఖాళీ అయితే తాగునీటికి ఇబ్బందులు తప్పవంటూ ప్రజలు ఆందోళన
సాక్షి, అమరావతి: దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు చంద్రబాబు సర్కారు చేస్తున్న జలద్రోహంపై వైఎస్సార్‌సీపీ సమరభేరి మోగించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు తక్షణమే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో సోమవారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద రైతులతో కలిసి భారీఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం ఉ.6 గంటల వరకూ 203.67 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అందులో కేవలం ఏడెనిమిది టీఎంసీలు మాత్రమే ఇప్పటివరకూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా ద్వారా సరఫరా చేశారు.
మరోవైపు.. ఎడమ గట్టు విద్యుత్కేంద్రం విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు నాలుగు టీఎంసీలు.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు తరలిస్తూ తెలంగాణ సర్కారు శ్రీశైలాన్ని ఖాళీ చేస్తోంది. అయినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు గరిష్ఠంగా ఎనిమిది వేల క్యూసెక్కులను మాత్రమే చంద్రబాబు సర్కారు విడుదల చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలించేలా రూ.3,500 కోట్లతో హంద్రీ–నీవాను అభివృద్ధి చేశామని పదేపదే సర్కారు చెబుతున్నప్పటికీ మూడు వేల క్యూసెక్కులకు మించి ఎత్తిపోయడంలేదు.
ప్రస్తుతం శ్రీశైలంలో 876 అడుగుల్లో 168.26 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 35–40 వేల క్యూసెక్కులు తరలించే అవకాశమున్నప్పటికీ చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి అంచనాల మేరకు వరద ప్రవాహం వచ్చే అవకాశంలేదు. అయినా, తెలంగాణ సర్కారు ఇదే రీతిలో నీటిని తోడేస్తే కొద్దిరోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది. పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అంతర్భాగమైన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తక్షణమే పోతిరెడ్డిపాడు ద్వారా గరిష్ఠ స్థాయిలో నీటిని తరలించకపోతే సాగునీటికే కాదు.. తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, గాలేరు–నగరి ఆయకట్టులో కనీసం ఆరుతడి పంటలకు కూడా నీళ్లివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. కరువు పరిస్థితులవల్ల పశుగ్రాసం లేక పశువులను తెగనమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు దన్నుగా సర్కారుపై వైఎస్సార్‌సీపీ కదనభేరి మోగించింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందం మేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులను ఆపేసి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టిన చంద్రబాబు తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసిన విషయం విదితమే.
కరువులోనూ వెన్నుపోటు పొడుస్తారా?..
వెన్నుపోటు, చంద్రబాబు పర్యాయ పదాలని మరోసారి నిరూపితమవుతోంది. తీవ్రమైన కరువు పరిస్థితుల్లోనూ గుక్కెడు తాగునీళ్లు ఇవ్వకుండా పురిటిగడ్డ రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు. తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేస్తుండటంవల్ల శ్రీశైలం ఖాళీ అవుతోంది. అయినాసరే.. పోతిరెడ్డిపాడుకు కేవలం 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టుల్లో అంతర్భాగమైన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తక్షణమే పోతిరెడ్డిపాడుకు పూర్తిసామర్థ్యం మేరకు నీటిని విడుదలచేసి.. ఆ రిజర్వాయర్లకు నీటిని చేర్చకపోతే తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హంద్రీ–నీవాకూ సామర్థ్యం మేరకు 3,850 క్యూసెక్కులు సరఫరా చేయాలి. ఇదే డిమాండ్‌తో రైతులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యాం. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి


