రుయా ఆస్పత్రి వద్ద థామస్ అనుచరుల హల్‌చల్
మృతురాలి తల్లిదండ్రులను మీడియా కంటపడకుండా రహస్య ప్రాంతానికి తరలింపు
మార్చురీ వద్ద మీడియాపై దురుసు ప్రవర్తన
తిరుపతి తుడా: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే వీఎం థామస్ చెన్నైలో నిర్వహిస్తున్న చెన్నై ఫెర్టిలిటీ సెంటర్‌లో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్న శ్వేతా ఘోష్ ఆత్మహత్య ఘటనను అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఎమ్మెల్యే విశ్వప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తనకున్న రాజకీయ పలుకుబడి, ధనబలంతో కేసును తారుమారు చేసేందుకు సైతం ప్రయత్నించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే యువతి తల్లిదండ్రులను సైతం నోరెత్తకుండా చేసినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం లేకుండానే తరలించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే, శ్వేత మృతి విషయాన్ని తెలుసుకున్న తమిళనాడు పోలీసులు హుటాహుటిన శనివారం రాత్రి తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఇక తప్పని పరిస్థితులో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఆస్పత్రి వద్ద ఎమ్మెల్యే అనుచరుల హల్‌చల్..
శ్వేతా ఘోష్ పోస్టుమార్టం విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో రుయా ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యే థామస్ అనుచరులు మార్చురీ వద్ద హల్‌చల్ చేశారు. మృతురాలి తల్లిదండ్రులను మీడియా కంట పడకుండా రహస్య ప్రాంతంలో ఉంచారు. వివరాలు సేకరించేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు.
థామస్ అనుచరులు గుండయ్యతో పాటు మరికొందరు హంగామా చేస్తూ మృతదేహాన్ని మృతురాలి స్వస్థలానికి చేర్చేందుకు వాహనంలో ఎక్కించారు. మరోవైపు.. శ్వేతా ఘోష్ పోస్టుమార్టం నివేదిక నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి వచ్చిన చెన్నై పోలీసులు ఈ ఘటనపై నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మీడియాపై చిందులు
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే అనుచరుడు గుండయ్య ఆదివారం రుయా మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. శ్వేతా ఆత్మహత్య ఘటనపై ఇప్పటికే తమిళనాడు పోలీసులు ఎమ్మెల్యే ఫెర్టిలిటీ సెంటర్ హెచ్‌ఆర్‌ను అరెస్టుచేశారని చెప్పారు. బెంగాల్ నుంచి వచ్చిన శ్వేతాఘోష్ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకే తామిక్కడికి వచ్చామని తెలిపారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వస్థలానికి తీసుకెళ్తారని చెప్పారు. ఘటనను తేలికగా తీసిపారేస్తూ ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడుతున్నారా అన్న మీడియా ప్రశ్నకు అతడు చిందులు తొక్కాడు.


