source: X
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అనుకోని సమస్య ఎదురైంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను, భద్రతా కారణాల దృష్ట్యా ఒక రోజు వెనక్కి జరిపే అంశాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.
తొలి టీ20 షెడ్యూలైన సెప్టెంబర్ 13నే ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు (BRICS Summit) జరుగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా బలగాల మోహరింపు, వీఐపీ రాకపోకలు, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్లలో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే మ్యాచ్‌ను ఒక రోజు వాయిదా వేసి సెప్టెంబర్ 14న నిర్వహించాలని నిర్వహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. సంబంధిత అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, తొలి టీ20తో పాటు భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మొత్తం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగనుంది. తొలి టీ20 మినహా మిగతా మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఒకవేళ తొలి మ్యాచ్‌ను వాయిదా వేయాల్సి వస్తే.. మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి.
చదవండి: ఫిన్ అలెన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు


