వైభవ్‌ను కాదని నీకు ఛాన్స్‌ ఇచ్చి ఏం లాభం? | What Sanju do get chance Vaibhav Must Say That:IND Ex Star Slams Strategy | Sakshi
Sakshi News home page

వైభవ్‌ను కాదని నీకు ఛాన్స్‌ ఇచ్చి ఏం లాభం?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Sep 14 2026 10:34 AM | Updated on Sep 14 2026 11:31 AM

What Sanju do get chance Vaibhav Must Say That:IND Ex Star Slams Strategy

వైభవ్‌ సూర్యవంశీ (PC: BCCI X)

టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మరోసారి విఫలమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో సంజూ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అప్పటి నుంచి విఫలం
టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భారత్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. ఆ ఈవెంట్‌ తర్వాత టీమిండియా తరఫున ఇప్పటికి ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 43 పరుగులే చేయడం ఇందుకు కారణం.

ఈ నేపథ్యంలో సంజూను కాదని అభిషేక్‌ శర్మకు జోడీగా వైభవ్‌ సూర్యవంశీని ఫిక్స్‌ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను కాదని.. సంజూను ఆడించడాన్ని తప్పుబట్టాడు.

వైభవ్‌ను కాదని ఛాన్స్‌ ఇచ్చి ఏం లాభం?
ఈ మేరకు క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘అప్పుడప్పుడు సంజూకు తుదిజట్టులో అవకాశం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? అతడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఓసారి జట్టు నుంచి తప్పించిన తర్వాత సహజంగానే ఆటగాడు ఫామ్‌ కోల్పోతాడు. కానీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తాడు.

అయితే, సంజూ విషయంలో ఇది జరుగలేదు. అయినా సరే అతడికి ఎందుకు అవకాశం ఇస్తున్నట్లు? ఇదే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. జింబాబ్వే సిరీస్‌లో వైభవ్‌ సూర్యవంశీ అదరగొట్టాడు. జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గానూ నిలిచాడు.

PC: X
నేనేం తప్పు చేశాను?
అయినా సరే జింబాబ్వేలో ఆడిన ఓపెనింగ్‌ జోడీ అభిషేక్‌ శర్మ- వైభవ్‌ సూర్యవంశీలను ఎందుకు విడదీసినట్లు? ఇది మరో ప్రశ్న. ఇప్పటికీ టీ20లలో తమ అత్యుత్తమ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ ఏదోనన్న అంశంపై టీమిండియా స్పష్టతకు రాలేకపోతోందా? ఇంకెంత కాలం ఈ విషయం గురించి ఆలోచిస్తారు?

వైభవ్‌ కచ్చితంగా.. ‘నేనేం తప్పు చేశాను’ అని అడిగే ఉంటాడు. ఇంతటి గందగోళం ఎందుకు? ఓపెనింగ్‌కు సంబంధించిన సరైన కూర్పు ఏదో తెలుసుకోండి’’ అని మహ్మద్‌ కైఫ్‌ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు.

అందుకే ఆడించారేమో!
అయితే, అదే షోలో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్‌ మోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘సంజూ సీనియర్‌ ఆటగాడు. ప్రపంచకప్‌ టోర్నీలో గొప్పగా ఆడాడు. మరో విషయం ఏమిటంటే.. వైభవ్‌ ఆడితే తుదిజట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య పెరుగుతుంది. 

లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం కూడా సంజూ వైపు మొగ్గు చూపి ఉంటారు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్‌ అఫ్గాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మెరుపు అర్ధ శతకం (32 బంతుల్లో 82)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (33 బంతుల్లో 42) కూడా రాణించాడు. మరోవైపు.. సంజూ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ బౌలింగ్‌లో డార్విష్‌ రసూలీకి క్యాచ్‌ ఇచ్చి నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement