నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు: బీసీసీఐ | He did not raise any objection: BCCI Reveals Mohsin Naqvi Reaction | Sakshi
Sakshi News home page

నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు: బీసీసీఐ

Sep 15 2026 1:05 PM | Updated on Sep 15 2026 1:49 PM

He did not raise any objection: BCCI Reveals Mohsin Naqvi Reaction

PC: X

మహిళల ఆసియా కప్‌-2026 ట్రోఫీ నిరాకరణ అంశం గురించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్‌ నక్వీ చేతుల మీదుగా బహుమతి అందుకోమని ముందుగానే బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.

నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు
ఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునే విషయం గురించి మేము ముందుగానే చర్చించుకున్నాము. అతడే ట్రోఫీ ఇస్తానని పట్టుబడితే తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చాము. జట్టుకు ఇదే విషయాన్ని తెలియజేశాము.

ఇది బోర్డు సామూహిక నిర్ణయం. ఇందుకు నక్వీ కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుకే వేదిక దగ్గరకు వచ్చి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని తెలిపారు. కాగా మహిళల ఆసియా టీ20 కప్‌-2026 టోర్నీలో భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

అపుడు కూడా ఇలాగే
దుబాయ్‌ వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసి హర్మన్‌ సేన టైటిల్‌ గెలుచుకుంది. అయితే, భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్‌ గెలిచినప్పటికీ భారత పురుషుల క్రికెట్‌ జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.

తాజాగా 2026లో చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా జట్టు సైతం అదే బాటలో నడిచింది. అయితే, ఈసారి తాము ముందుగానే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోమని బీసీసీఐ ఏసీసీకి సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ నక్వీ తానే స్వయంగా బహుమతి ప్రదానం చేస్తానని వేదిక వద్దకు రాగా.. భారత జట్టు కిందే ఉండిపోగా.. రన్నరప్‌ శ్రీలంకకు చెక్‌ ఇచ్చి నక్వీ వెళ్లిపోయాడు.

ట్రోఫీ ఇంకా చేతికి రాలేదు
ఇదిలా ఉంటే.. పురుషుల జట్టుకు రావాల్సిన ఆసియా కప్‌ ట్రోఫీ ఇంకా బీసీసీఐ చేతికి అందనేలేదు. తాజాగా మహిళల ట్రోఫీ కూడా ఎప్పుడు చేతికి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా మాట్లాడుతూ.. ఏసీసీతో సంప్రదించి త్వరలోనే రెండు ట్రోఫీలు దేశానికి చేరేలా చూస్తామని వెల్లడించారు. 

కాగా టీమిండియా గతేడాది ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించగా.. నక్వీ తనతో పాటే ట్రోఫీని ఎత్తుకెళ్లాడనే ప్రచారం జరిగింది. దీంతో తాజాగా మహిళల ఫైనల్‌ ముగిసిన తర్వాత నక్వీ స్టేడియంలోకి రాగా..‘ట్రోఫీ చోర్‌’ అంటూ టీమిండియా అభిమానులు నినాదాలు చేశారు. 

చదవండి: బాబర్‌ ఆజం సంచలన నిర్ణయం! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement