టీమిండియా (ఫైల్ ఫొటో: PC: BCCI/X)
టీమిండియా టెస్టు అత్యుత్తమ కెప్టెన్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. ఈ బ్యాటింగ్ దిగ్గజం సారథ్యంలో సంప్రదాయ క్రికెట్‌లో భారత జట్టు ఉన్నత శిఖరాలకు చేరింది. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న ఏడేళ్ల కాలంలో విదేశాల్లో చిరస్మరణీయ విజయాలు నమోదు చేయడంతో పాటు.. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది.
అయితే, టెస్టు సారథిగా కోహ్లి పగ్గాలు చేపట్టిన తర్వాత డ్రెసింగ్‌రూమ్‌లో చాలా మంది అతడి ఆలోచనా విధానాన్ని వ్యతిరేకించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. టీమిండియా వెటరన్ పేస్ బౌలర్, కోహ్లి సహచర ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
జతిన్ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా టెస్టు సారథిగా విరాట్ కోహ్లిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. అతడి ఆలోచనా విధానం, ఉద్దేశాలు అర్థం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. కొన్ని సిరీస్‌లు ఆడిన తర్వాత అతడి గురించి మాకు అవగాహన వచ్చింది.
కొందరు కోహ్లిని వ్యతిరేకించారు
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కెప్టెన్‌గా వచ్చిన కోహ్లి తన తొలి ప్రసంగంలోనే ఫిట్‌నెస్, డైట్ సంస్కృతి గురించి మాట్లాడాడు. అప్పుడు కొంతమంది వీటి అవసరం ఏముంది? అంటూ కోహ్లిని వ్యతిరేకించారు. కోహ్లి ఆలోచనలను ప్రశ్నించారు.
అయితే, ఆ తర్వాత కొంతకాలానికే ప్రతి ఒక్కరు కోహ్లి దారిలోకి వచ్చేశారు. ఫిట్‌నెస్, డైట్ ప్రాముఖ్యాన్ని తెలుసుకుని అతడితో కలిసి ముందుకు నడిచారు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి వైఖరి కారణంగా తాము వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతగానో విజయవంతమయ్యామని పలువురు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు సంతోషం వ్యక్తం చేశారు.
రోహిత్ శర్మపైనే ఆ ఎఫెక్ట్!
ఇదిలా ఉంటే.. భువీ ఎవరి పేర్లను ప్రస్తావించనప్పటికీ కోహ్లిని వ్యతిరేకించిన వాళ్లలో రోహిత్ శర్మ ముందున్నాడనే ప్రచారం గతంలో జరిగింది. కోహ్లి డిప్యూటీగా వ్యవహరించిన హిట్‌మ్యాన్.. యో-యో టెస్టు (ఫిట్‌నెస్)లో విఫలం కావడంతో 2017 ఇంగ్లండ్ పర్యటనలో అతడిని కేవలం వైట్‌బాల్ సిరీస్‌లకే ఎంపిక చేశారు.
ఆ తర్వాత 2020-21లో ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలోనూ రోహిత్ శర్మ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో రోహిత్- కోహ్లి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనే విమర్శలు వచ్చాయి. అయితే, ఇవన్నీ వట్టి వదంతులేనని.. కేవలం జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తామని రో-కో పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు.
విజయవంతమైన కెప్టెన్
కాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 2014లో టెస్టు పగ్గాలు చేపట్టిన కోహ్లి.. ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం నుంచి టీమిండియాను నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డ మీద విజయాలు అందించాడు. 2018-19లో తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో భారత్‌ను గెలిపించాడు.
భువీకి మద్దతుగా కోహ్లి
కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 68 టెస్టు మ్యాచ్‌లు ఆడి.. 40 గెలిచింది. ఇదిలా ఉంటే.. భువీకి మద్దతుగా నిలిచిన కోహ్లి.. అతడికి వరుస అవకాశాలు ఇచ్చాడు. అయితే, రోహిత్ శర్మ సారథిగా వచ్చిన తర్వాత భువీ కనుమరుగైపోయాడు. ప్రస్తుతం కోహ్లితో కలిసి ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడుతున్న భువీ.. 2025,2026 సీజన్లలో జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే.. టీమిండియా సారథులుగా పనిచేసిన రో-కో.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరూ వన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా కొనసాగుతున్నారు. ఇక నాడు కోహ్లి ఫిట్‌నెస్ మంత్రాకు అనుకూలంగా లేడన్న అపవాదు ఎదుర్కొన్న రోహిత్.. ఇటీవల పది కిలోలకు పైగా బరువు తగ్గి ఫిట్‌గా మారడం కొసమెరుపు.
చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం!


