వైభవ్ సూర్యవంశీ (PC: BCCI X)
అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20కి టీమిండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించిన శ్రేయస్ అయ్యర్ సేన.. మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
సునాయాస విజయం
కాగా ఢిల్లీ వేదికగా ఆతిథ్య అఫ్గాన్‌తో తొలి టీ20లో టీమిండియా మంచినీళ్లప్రాయంగా గెలుపొందింది. అఫ్గాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 82) కారణంగా భారత్‌కు ఈ విజయం సాధ్యమైంది.
ఇక ఈ మ్యాచ్‌తో తిరిగి టీమిండియాలోకి వచ్చిన మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం విఫలమయ్యాడు. కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. గత సిరీస్‌లో జింబాబ్వేలో సత్తా చాటిన ఈ పదిహేనేళ్ల పిల్లాడిని పక్కనపెట్టి.. సంజూకు అవకాశం ఇస్తే అతడు మాత్రం తేలిపోయాడనే విమర్శలు వస్తున్నాయి.
వైభవ్ మరోసారి బెంచ్‌కే పరిమితం!
ఈ నేపథ్యంలో అఫ్గాన్‌తో రెండో టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ మొదలైంది. సంజూను తప్పించి వైభవ్‌ను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. మెజారిటీ మంది విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సంజూకు మరో అవకాశం ఇస్తారని.. ఈ మ్యాచ్‌లోనూ విఫలమైతే అతడిని ఇక పూర్తిగా పక్కనపెట్టేస్తారని అభిప్రాయపడుతున్నారు.
వరుస మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ.. సీనియారిటి, ప్రపంచకప్-2026 ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఇంకో ఛాన్స్ ఇవ్వడమే సరైందని పేర్కొంటున్నారు.
ఒక మార్పు అనివార్యం!
ఇదిలా ఉంటే.. సంజూ- వైభవ్ విషయం ఎలా ఉన్నా.. భారత తుదిజట్టులో ఒక మార్పు మాత్రం అనివార్యం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అఫ్గాన్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌ల నుంచి దూరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో టీ20లో రవి బిష్ణోయి వరుణ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని తెలుస్తోంది.
అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయి.


